- ముఖ్యమంత్రి చెప్పినా లెక్కలేదు...
- ‘ఉదయ్’కు మోకాలడ్డిన ఆర్థిక శాఖ
- కేంద్రం ముందు రాష్ట్రం పరువు గోవిందా!
‘రాష్ట్రంలో ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా, కొత్త ఆలోచనతో ముందుకు సాగాలన్నా, ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులకు అధికారం లేదా? ఆర్థిక శాఖ అధికారులు ఆమోదిస్తేనే.. విధానపరమైన నిర్ణయాలకైనా.. కొత్త ఆలోచనలైనా ముందుకు సాగుతాయా? రాష్ట్రంలో ఈ విధానం అమలులో ఉందా? ఆర్థిక శాఖ కరుణిస్తేనే.. ఉద్యోగుల కరవు భత్యంగాని, సంక్షేమ పథకాలకు నిధులుగాని మంజూరవుతావా? ఈ ప్రశ్నలకు వివిధ శాఖలు ఔననే సమాధానం చెబుతున్నాయి. ఇటీవల జల వనరుల శాఖలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల అంచనాల సవరణ విషయంలో నానాయాగీ జరిగింది. కేబినెట్ ఆమోదించినా ఆర్థిక అడ్డుపుల్లలు వేస్తూ వచ్చింది. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేస్తే తప్ప కేబినెట్ తీర్మానం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్)లకు ఊపిరి పోసే ‘ఉదయ్’ పథకం అమలులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఉజ్వల్ డిస్కమ్ యోజన (ఉదయ్) పథకాన్ని అమలు చేస్తామంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇంతవరకూ అమలు కాలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ అయిష్టత ప్రదర్శించడమే ఇందుకు కారణంగా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ కంటే వెనుక వరుసలో ఉన్న రాజస్థాన, ఉత్తరప్రదేశ ‘ఉదయ్’ను అమలు చేస్తామంటూ కేంద్ర ఇంధన శాఖతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. డిస్కమ్‌ల తరఫున ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. రూ.70,000 కోట్ల బాండ్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. కానీ కేంద్రానికి ఎప్పుడో మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ మాత్రం ఆర్థిక శాఖ కొర్రీలతో అమలు చేయలేకపోయింది. పైగా కేంద్రం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నెల 27న కృష్ణపట్నం థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌ను జాతికి అంకితం చేసేందుకు వస్తున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తే ఏంచేయాలో తోచని పరిస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉదయ్‌కు అడ్డుచెబుతోందని పియూష్ గోయల్‌కు చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని వారంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే.. ‘ఉదయ్’కు ఆర్థిక శాఖ గ్రహణం పట్టిందని ప్రభు త్వ వర్గాలు చెబుతున్నాయి. డిస్కమ్‌లు చేసిన రుణాల్లో 75 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాల్లోకి తీసుకుంటే.. కేంద్రం కొన్ని పథకాలను ఉదారంగా అమలు చేస్తుంది. కానీ రాష్ట్ర ఆర్థిక శాఖకు ఈ పథకం నచ్చలేదు అని ఉన్నతాధికార వర్గాలు వివరిస్తున్నాయి.
‘ఉదయ్’ను అమలు చేస్తే- కేంద్రం ప్రకటించిన ఉదయ్ పథకాన్ని అమలుచేస్తే గత మూడేళ్ల (2013-14 నుంచి 2014-16 వరకు) డిస్కమ్‌ల నష్టాలు రూ.14,665 కోట్లలో 75 శాతం.. అంటే రూ.11,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని బహిరంగ మార్కెట్లో బాండ్ల రూపంలో ప్రజల ముందు ఉంచాలి. ఈ బాండ్లకు 8 శాతం చెప్పున చెల్లించాలి. డిస్కమ్‌లు చెల్లించాల్సిన 15 శాతం వడ్డీ భారం తగ్గుతుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. పాలనాపరమైన సంస్కరణలు అమలుచేస్తూ దుబారా ఖర్చులు తగ్గించుకుంటూ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
- డిస్కమ్‌లపై వడ్డీ భారం రూ.554 కోట్లు తగ్గుతుంది.
- దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద రూ.365 కోట్లు అదనపు నిధులు వస్తాయి.
- ఎనటీపీసీ ప్లాంట్ల నుంచి అదనంగా వచ్చే విద్యుత్తు వల్ల రూ.243 కోట్లు ప్రయోజనం చేకూరుతుంది.
- అదనపు బొగ్గు పంపిణీ వల్ల రూ.110 కోట్ల దాకా ఆదా అవుతుంది.
- బాండ్లను విడుదల చేయడం వల్ల ప్రభుత్వానికి ఉన్నపళంగా ఎలాంటి చెల్లింపుల భారం పడదు.
- డిస్కమ్‌లు ఆర్థికంగా బలోపేతమవుతాయి. నవ్యాంధ్రలో నిరంతర విద్యుత్తుకు అవసరమయ్యే కార్యాచరణ చేపడతాయి.
- ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం పూచీపడినా ఎఫ్‌ఆర్‌బీఎం షరతులు వర్తించవు.
‘ఉదయ్’ అమలు చేయకపోతే- డిస్కమ్‌లు 15 శాతం వడ్డీని చెల్లించాలి. ప్రస్తుత తరుణంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న డిస్కమ్‌లకు వడ్డీ చెల్లింపులు పెనుభారం అవుతాయి. డిస్కమ్‌లు మనుగడ సాగించాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి.. వినియోగదారులపై భారీగా 19 నుంచి 20 శాతం మేర చార్జీల భారం వేయడం. రెండోది.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా సబ్సిడీని గుంజడం. అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి యేటా రూ.3500 కోట్లు డిస్కమ్‌లకు సబ్సిడీ రూపంలో వస్తుంది. దానిని రూ.4562 కోట్లకు పెంచాలి. అదేవిధంగా వినియోగదారుల నుంచి రూ.3540 కోట్ల వరకూ అదనంగా చార్జీలను వసూలు చేయాలి. ఈ రెండూ సాధ్యమయ్యేవి కాదు. రాజకీయంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది.
- వాస్తవాలు ఇలా ఉంటే.. ఆర్థిక శాఖ- ఇంధన శాఖ అధికారులతో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉదయ్‌ను ఎటూ తేల్చకుండా వదిలేస్తున్నాయి. ఉదయ్‌పై ఈ మార్చిలోగా నిర్ణయం తీసుకోకుంటే.. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఉన్న రాజస్థాన, ఉత్తరప్రదేశ బాండ్లు రూ.70,000 కోట్లను ప్రజలు కొనుగోలుచేస్తే .. ఇక మన బాండ్లను కొనుగోలు చేసేవారు దొరకరు. పైగా ఆర్థిక సంవత్సరం మారిపోతే.. ఒక ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కోల్పోవాల్సి వస్తుంది.
- గత బాండ్ల విషయంలోనూ ఇదే విధానం: డిస్కమ్‌లు గతంలో రూ.4500 కోట్లను బాండ్లుగా ప్రకటించాయి. ఇందులో రూ.2000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పూచి పడింది. మిగిలిన రూ.2500 కోట్లలో రూ.1500 కోట్లకు 2015-16లో, 1000 కోట్లకు 2016-17 రాష్ట్ర ప్రభుత్వం పూచీ పడాలి. కానీ ఆర్థిక శాఖ ఇందుకు ససేమిరా అంటోంది. పోనీ ఈ మొత్తాన్ని కూడా ‘ఉదయ్’లో చేర్చితే ఎఫ్‌ఆర్‌బీఏం షరతులను తప్పించుకోవచ్చన్న ఇంధన శాఖ సూచనలను ఆర్థిక శాఖ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
- బయోమాస్ విషయంలోనూ ఆర్థిక శాఖ ఇదేవిధంగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో బయోమాస్ యూనిట్లకు రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఉత్తర్వు కూడా జారీ చేశారు. ఈ మొత్తాలు చెల్లించాలంటూ ఆర్థిక శాఖను కోరుతుంటే.. ప్రభుత్వ ఉత్తర్వులు సరేకానీ రూ.100 కోట్ల మొత్తాన్ని ఏ పద్దు కింద చెల్లించాలంటూ కొర్రీలు వేస్తోంది.
Tuesday, 23 February 2016
ఆర్థిక శాఖే మోనార్క్!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment