- దొరకని ప్రధాని, హోం మంత్రులఅపాయింట్మెంట్లు
ఒకపక్క కీలకమైన వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరుతుంటే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం సోమవారం ఢిల్లీలో మకాం వేయడం విస్తుగొల్పుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు ఉన్నాయంటూ సోమవారం ఉదయం హుటాహుటిన దేశరాజధాని చేరుకున్న ఆయన.. రోజంతా తమ పార్టీకే చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో గడిపారు.
పని మనుషులను కూడా బయటకు పంపి కొద్దిమంది ముఖ్యులతో మాత్రమే మంతనాలు జరిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కూడా జగన్ రాకపై ముందస్తు సమాచారం లేకపోవడం విశేషం. ప్రధాని మోదీ వారణాసి పర్యటన ముందుగానే ఖరారు కాగా జాట్‌ల ఆందోళన కారణంగా హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రోజంతా తీరిక లేకుండా ఉన్నారు. మరో పక్క మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన రాష్ట్రపతి కూడా సోమవారం ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదు.కాగా జగన్ కొందరు ఆర్ధిక, హోం శాఖల అధికారులతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహారాలను చూస్తున్న రెవెన్యూశాఖలోని కొంతమంది కీలక అధికారుల నివాసాలకు ఆయన వెళ్లి కలిసినట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖలోని తన సన్నిహిత ఐఏఎ్‌సలతో కూడా భేటీ కాగా గతంలో టీటీడీ ఈవోగా పనిచేసి ప్రస్తుతం హోం శాఖలో చక్రం తిప్పుతున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి మాత్రం జగన్ వద్దకే వచ్చి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.జగన్ హాజరు కావాలంటూ ఈడీ కోర్టు ఇటీవలే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానిని పార్లమెంటు ఆవరణలోనే కలిసి ప్రత్యేక హోదాపై ఒక మెమోరాండం ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలిసింది.
Tuesday, 23 February 2016
జగన్ ఢిల్లీ ఎందుకొచ్చినట్లు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment