పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

అగ్రిజోన్ల పేరిట ఆంక్షలు వద్దు

  • ప్రజాందోళనను పరిగణనలోకి తీసుకుని..
  • భూవినియోగంపై స్వేచ్ఛ ఇవ్వండి
  • సీఆర్‌డీఏకు కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల సూచన
  • పరిశీలిస్తాం తర్వాతే తుది ప్రణాళిక: సీఆర్‌డీఏ

సీఆర్‌డీఏ పర్‌స్పెక్టివ్‌ మాస్టర్‌ప్లాన్- 2050లోని వ్యవసాయ జోన్లు, ప్రధానంగా జోన్-1పై కృష్ణాజిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భూయజమానుల స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ జోన్ కారణంగా తాము వీధిన పడడం ఖాయమని రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. పైగా ఈ అగ్రికల్చర్‌ జోన్ను కఠిన నిబంధనలతో కూడిన ‘గ్రీన జోన్’గా భావిస్తూ సీఆర్‌డీఏ పరిధిలోని రైతులు, ఇతర వర్గాల ప్రజలు పెద్దఎత్తున భయాందోళనలు చెందుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల వ్యవసాయ జోన్లను రద్దు చేయాలని కోరారు. సీఆర్‌డీఏ పర్‌స్పెక్టివ్‌ మాస్టర్‌ప్లాన్-2050పై కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని నిర్ణయించిన సీఆర్‌డీఏ... అందులో భాగంగా శనివారం విజయవాడలో కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, కేశినేని నాని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, వల్లభనేని వంశీమోహన్, బోడే ప్రసాద్‌, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్‌, ఏఎస్‌ రామకృష్ణ ప్రసంగిస్తూ సీఆర్‌డీఏ పరిధిలో ఎలాంటి ఆంక్షలూ లేకుండా తమ భూములను వినియోగించుకునేందుకు రైతులందరికీ అవకాశమివ్వాలని కోరారు. పర్‌స్పెక్టివ్‌ మాస్టర్‌ప్లాన్లోని మూడు వ్యవసాయ జోన్లలో ప్రధానంగా అగ్రికల్చరల్‌ జోన్-1 కింద ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెంది, నగరీకరణ దిశగా పరుగులు తీస్తున్న పలు మండలాలను చూపడం గర్హనీయమన్నారు.
 
సహజసిద్ధంగా జరిగే అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు పలు అవాంఛనీయ పరిణామాలకూ దారి తీసేలా ఉన్న ఈ వ్యవసాయ జోన్లను రద్దు చేసి... ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ భూములను వినియోగించుకునే అవకాశాన్ని రైతులకు కల్పించాలని డిమాండ్‌ చేశారు.మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదిత ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ల అలైన్‌మెంట్లపైనా ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ కమిషన్‌ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రకటించినది ముసాయిదా మాస్టర్‌ప్లాన్ మాత్రమేనని, దానిపై ప్రజల అభ్యంతరాలు, సూచనలన్నింటినీ పరిశీలించాక తుది ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. ఆ ఉద్దేశంతోనే అభ్యంతరాలు, సూచనల దాఖలుకు గడువును గత నెల 25 నుంచి ఈ నెల 29 వరకూ పొడిగించామన్నారు. సీఆర్‌డీఏకు ముందు మనుగడలో ఉన్న వీజీటీఎం ఉడా పరిధిలోని 1954 చదరపు కిలోమీటర్లలో గుర్తించిన జోనల్‌ నిబంధనలే యథాతథంగా పర్‌స్పెక్టివ్‌ ప్రణాళికలో కూడా అమలవుతాయని, అందువల్ల వాటిపై ప్రజలకు ఎలాంటి ఆందోళనా వద్దన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో గుర్తించిన జోన్ల అభివృద్ధి ప్రణాళికలను ఈ ఏడాది డిసెంబర్‌కల్లా రూపొందిస్తామన్నారు.

No comments:

Post a Comment