బస్తాకు రూ.50 వరకు తగ్గిన ధర
సి‘మంట’ తగ్గింది. ఫిబ్రవరి వచ్చినా నిర్మాణ రంగం ఇంకా పుంజుకోలేదు. దీంతో నెల రోజుల క్రితం రూ.300 నుంచి రూ.350 పలికిన 50 కిలోల సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం రూ.50 వరకు దిగొచ్చింది. ఈ సంవత్సరం జనవరి నెలాఖరు వరకు హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా రూ.320 నుంచి రూ.350 వరకు పలికింది. ప్రస్తుతం అదే సిమెంట్ రూ.280 నుంచి రూ.310 మధ్య లభిస్తోంది. ధర తగ్గినా అమమ్మకాలు ఏ మాత్రం పుంజుకోలేదని డీలర్లు చెబుతున్నారు. వైజాగ్, తిరుపతి, విజయవాడల్లోనూ ఇదే పరిస్థితి. పెద్దగా పేరులేని కంపెనీల సిమెంట్ అయితే విజయవాడలో బస్తా రూ.250కే లభిస్తోంది. డిమాండ్ లేక కంపెనీలు ధర తగ్గించాయని డీలర్లు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే నాలుగో త్రైమాసికంలో అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు ధర మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని కంపెనీల ఉన్నతాధికారులు మాత్రం సిమెంట్ ధర తగ్గిందనడాన్ని తోసిపుచ్చుతున్నారు. గతంలో డీలర్లకు ఇన్వాయి్‌సపై ఇచ్చిన డిస్కౌంట్లను మాత్రమే తగ్గించామని చెబుతున్నారు.అమ్మకాలు పెంచుకునేందుకు కొన్ని కంపెనీలు నేరుగా తమ నుంచి ఒక లారీకి మించి సిమెంట్ కొనే వినియోగదారులకు బస్తాకు రూ.10 నుంచి రూ.20 వరకు డిస్కౌట్ ఇచ్చి సరఫరా చేస్తున్నాయి. డీలర్లు దీనిపై గగ్గోలు పెట్టడంతో కొన్ని కంపెనీలు ఈ విషయంలో వెనక్కి తగ్గాయి.
ఆర్థిక రంగం ఇంకా గాడిన పడక పోవడం కూడా కంపెనీలను దెబ్బతీస్తోంది. అయితే జిహెచ్‌ఎంసి పరిధిలో 400 కిలోమీటర్ల వైట్‌టాప్ రోడ్లు, తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించిన జాతీయ రహదార్లు, ఒకటి రెండు నెలల్లో సిమెంట్ గిరాకీ పెంచుతాయని పరిశ్రమ వర్గాలు కొండంత ఆశతో ఉన్నాయి. గిరాకీ అంతంత మాత్రంగానే ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ప్లాంట్లు తమ స్థాపిత ఉత్పత్తి సామర్ధ్యంలో 50 నుంచి 55 శాతానికి మించి ఉపయోగించుకోలేక పోతున్నాయి.
ఏటా ఫిబ్రవరి నుంచి ఎపి, తెలంగాణలో నిర్మాణ రంగం పుంజుకునేది. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, విజయవాడలాంటి ప్రధాన నగరాల్లోనూ సిమెంట్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. శంకుస్థాపనలకు సరైన ముహూర్తాలు లేకపోవడం కూడా సిమెంట్ ధరలను దెబ్బతీసింది. బలహీన వర్గాల గృహ నిర్మాణం, రహదార్ల నిర్మాణం గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా, ఇప్పటి వరకు ఒక్క టన్ను సిమెంట్‌కు కూడా ఆర్డర్ రాలేదని సమాచారం.
No comments:
Post a Comment