- జలవనరుల శాఖ అధికారులపై సీఎం సీరియస్
- పని చేయని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో : చంద్రబాబు
‘పెండింగ్ ప్రాజెక్టులను మేం అధికారంలోకి వచ్చాక విశ్లేషించాం. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మినహాయిస్తే మిగిలిన ప్రాజెక్టుల్లో మేము వచ్చే సమయానికి ఇంకా రూ.11,229 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉంది. పెరిగిన ధరల ప్రకారం చూస్తే రూ.17,907 కోట్లు అవసరమవుతాయి. సుమారు 6వేల కోట్ల అంచనాలను సవరించడం ద్వారా పనులు పూర్తి చేయవచ్చు. పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిస్తే ఈ మొత్తం రూ. 24,705 కోట్లు అవుతుంది. అంటే, రూ.13,475 కోట్లు అదనం. అందుకే టెండర్లు రద్దు చేయకుండా పనులు కొనసాగిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘జలవనరుల శాఖ సందర్భానికి...అవసరానికి తగ్గ విధంగా సన్నద్ధం కావాలి. ఇంకా 44,538 ఎకరాలు సేకరించాల్సి ఉంది. నేను ప్రాజెక్టుల వద్ద నిద్రించా. సమావేశాలు ఏర్పాటు చేశా. నేను చేయాల్సిందంతా చేశాను. ఇక జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు తమ సామర్థ్యాన్ని చూపించాల్సి ఉంది’ అని సీఎం పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.11,300 కోట్లు ఖర్చు చేశాం. వచ్చే మూడేళ్లలో మరో 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి’ అని సీఎం వివరించారు. ప్రాజెక్టులవారీ నిర్మాణ లక్ష్యాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం కుడి కాల్వ నిర్మాణం ఈ ఏడాది జూన్‌నాటికి, ఎడమ కాల్వ నిర్మాణం 2017 జూన్‌నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. 2018 నాటికి పోలవరం మొదటి దశ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. వంశధార స్టేజ్-2ను 2017 జూన్ నాటికి, తోటపల్లి ప్రాజెక్టును ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని కోరారు. పట్టిసీమను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వెలిగొండకు 2017 డిసెంబర్‌ను డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు ఈ ఏడాది 100టీఎంసీల జలాలను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
No comments:
Post a Comment