సువిశాల సముద్రంలో రివ్వున సాగే స్పీడ్ బోట్లు, గస్తీ నౌకలు.. నీలాకాశంలో ఒళ్లు గగుర్పొడిచే సాహసాలతో చేతక్ హెలికాప్టర్లు.. శనివారం విశాఖ తీరాన ‘డే ఎట్ సీ’ కార్యక్రమంలో ఆవిష్కృతమైన అద్భుత సన్నివేశాలు ఇవి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం దేశ సముద్ర తీర రక్షణ కోసం ఏర్పడిన ఇండియన్ కోస్టు గార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతిఏటా ఫిబ్రవరి 1న నిర్వహిస్తుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 5 నుంచి ఫిబ్రవరి నెలాకరు వరకు కోస్టు గార్డు దళాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా శనివారం ‘డే ఎట్ సీ’ కార్యక్రమం జరిగింది. పలు గస్తీ నౌకలతో సాగిన పరేడ్ ఆకట్టుకుంది. ఈ పరేడ్‌కు కాలుష్య నియంత్రణ తీరగస్తీ నౌక ‘సముద్ర పెహరీదార్’ నాయకత్వం వహించింది. విగ్రహ, రాణి అవంతిబాయి, సరోజినీనాయుడు, చార్లీ 430 నౌకలు దాన్ని అనుసరించాయి. ఈ సందర్భంగా కోస్టుగార్డు దళాలు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఏపీ మెరైన్ ఐజీ జి.సూర్యప్రకాశరావు, కోస్టుగార్డు ఐజీ ఎ.ఎస్. శర్మ, ఏపీ డీఐజీ ఏకే హరిబోలా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment