- షుగర్ బాధితుల్లో 22.78శాతం మంది వారే..
- భాగ్యనగరిలో నానాటికీ విస్తరిస్తున్న ఆనవాళ్లు
- కార్పొరేట్ ఉద్యోగుల్లో అధికమవుతున్న ప్రభావం
- అపోలో షుగర్ క్లినిక్స్ అధ్యయనంలో వెల్లడి
- పదిలో నలుగురికి మధుమేహ ప్రభావం
22.78 శాతం యువతే
ఈ సర్వేలో మొత్తం 37,075 మందికి పరీక్షలు చేశారు. అందులో 7,839 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వయసు వారీగా నాలుగు వర్గాలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. 31 నుంచి 40 ఏళ్లు, 41- 50, 51- 60, 60 పైబడిన వారుగా విభజించి సర్వే చేసినట్లు అపోలో షుగర్ క్లినిక్ డయాబెటాలజిస్టు డాక్టర్ సంజయ్‌పాల్ వివరించారు. 31-40 ఏళ్ల వారిలో 22.78 శాతం మంది దాని బారిన పడ్డారని తేలింది. 26.16 శాతం మంది 41-50 ఏళ్ల వారు, 22.97 వాతం మంది 51- 60 ఏళ్లవారు, 29.99 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు మధుమేహంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కాగా, 20 శాతం మందికి మధుమేహ ముప్పు (ప్రీ డయాబెటిక్) పొంచి ఉన్నట్లు కనుగొన్నారు. ఇలాంటి వారు ఆహారపుటలవాట్లు మార్చుకోవడం, శారీరక వ్యాయామం ద్వారా మధుమేమాన్ని ఆదిలోనే దూరం చేసుకోవచ్చని సంజయ్ సూచిస్తున్నారు.
కార్పొరేట్ ఉద్యోగుల్లోనే...
మధుమేహం.. అధికంగా కార్పొరేట్ ఉద్యోగులనే పీడిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 31 నుంచి 40 వయస్సులో మధుమేహం బారిన పడుతున్న అధిక శాతం మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులేనట. ఇంకో విషయమేంటంటే.. సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మందికి తమకు మధుమేహం ఉందన్న విషయమే తెలియదట. ఈ అధ్యయనం ద్వారా మాత్రమే వారు మధుమేహులుగా తేలింది. ఇక, మధుమేహం ఉన్న మిగతా 80 శాతం మందికి ఆ విషయం తెలిసినా.. దాని నియంత్రణ, అవగాహన తెలియదని అధ్యయనంలో తేలింది. గంటల కొద్ది చైర్‌లోనే కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఉంటే కష్టమే అంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. కదలకుండా ఉండిపోవడం వల్ల శారీరక శ్రమ తగ్గి మధుమేహానికి ఆస్కారం ఎక్కువంటున్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్‌తో ఎక్కువసేపు గడిపేవారు, పనిచేసేవారు, డెస్క్ వర్క్, ఏసీలోనే ఎక్కువ సమయం గడిపే వారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. కదలికల్లేకపోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదముందని డాక్టర్ సంజయ్ తెలిపారు.
నిద్ర, ఆహారపు సమయాలు పాటించాలి
చాలా మంది నిద్ర, ఆహార సమయాలు పాటించకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ త్వరగా పడుకోవడం, వేకువ జామున లేచి వాకింగ్ చేయడం అలవర్చుకోవాలి. శరీరానికి చెమట పట్టే విధంగా వాకింగ్ చేయడం వల్ల మధుమేహాన్ని నియంత్రించుకునే అవకాశముంది. ఆఫీసులో ఏది పడితే అది తినకుండా సరైన ఆహార నియమాలు పాటించాలి. ఫాస్ట్ ఫుడ్, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ సేపు కూర్చీల్లో అతుక్కుపోకుండా గంటకొక సారి లేచి అటు ఇటు తిరగాలి.
- డాక్టర్ సంజయ్‌పాల్, డయబెటాలజిస్టు, అపోలోపు
No comments:
Post a Comment