- 304 కోట్లు ఎవరి ఖాతాకు చేరాయి?..
- బ్యాంకు రుణాలు 4 కంపెనీలకు బదిలీ
- సుజనా గ్రూపుతో కల్యాణరావుకు అనుబంధం..
- ఆ కంపెనీల్లో డైరెక్టర్‌గా బాధ్యతలు
- సీబీఐ చేతిలో కీలక డాక్యుమెంట్లు..
- విచారణలో మరిన్ని సంచలనాలు!సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు తనయుడు కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావు ఎండీగా ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.304 కోట్ల రుణాలూ నేరుగా నాలుగు కంపెనీలకు బదిలీ అయ్యాయి! ఆ నాలుగు కంపెనీలూ ఎవరివి? వాటి వెనక ఎవరు ఉన్నారు!? బ్యాంకులను కొల్లగొట్టిన రూ.304 కోట్లూ ఎవరి ఖాతాలోకి వెళ్లాయి!? అనే అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాస కల్యాణరావు గతంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అంశంపైనా సీబీఐ అధికారులు దృష్టిసారించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కార్యాలయాలు, దాని ఎండీ శ్రీనివాస కల్యాణరావుకు చెన్నై, హైదరాబాద్‌ల్లో ఉన్న ఇళ్లపై సీబీఐ అధికారులు ఆదివారం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు సీబీఐ అధికారులకు లభించినట్లు చెబుతున్నారు. దాంతో కల్యాణరావుపై నమోదు చేసిన కేసు పలు రకాలుగా సంచలనాత్మకంగా మారింది. శ్రీనివాస కల్యాణ్ రావు 2012 ఫిబ్రవరి నుంచి బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎండీగా కొనసాగుతున్నారు. ఆ కంపెనీ తరఫున సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.124 కోట్లు, కార్పొరేషన బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, హైదరాబాద్‌లోని ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.60 కోట్లు రుణం మొత్తం రూ.304 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందుకు హైదరాబాద్ శివార్లలోని మంచిరేవుల ప్రాంతంలోని భూమి, చెన్నైలో కొంత స్థిరాస్తి, ముంబైలోని ఒక భవనాన్ని బ్యాంకులకు తనఖా పెట్టారు. తీసుకున్న అప్పు తిరిగి తీర్చడంలో విఫలం కావడంతో... ఆయన తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు సెంట్రల్ బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కల్యాణరావు తాకట్టు పెట్టిన డాక్యుమెంట్లు అసలువి కావని తేలింది. యంత్రాలు, పరికరాల కొనుగోలు బిల్లులూ నకిలీవే అని బయటపడింది. దాంతో బ్యాంకర్లు సీబీఐని ఆశ్రయించారు. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకుల కన్సార్షియంకు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం రూ.304 కోట్లు ఎగవేసినట్లు కంపెనీపైనా, కంపెనీ యాజమాన్యంపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే, బెస్ట్ అండ్ క్రాంప్టన్ తీసుకున్న రుణాల్లో కొన్ని కల్యాణరావు సదరు కంపెనీలో చేరడానికి ముందు తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, ఇది సాధారణ బ్యాంకు డిఫాల్టు వ్యవహారం కాదని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను లోపాయికారీగా బయటకు తరలించారని సీబీఐ అనుమానిస్తోంది. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ద్వారా నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు సీబీఐ వర్గాలు వివరిస్తున్నాయి. యంత్ర సామగ్రి, కొన్ని ముఖ్యమైన పరికరాల కొనుగోలు పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, కానీ, కంపెనీ ప్రతినిధులు సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం, ఆ సొమ్మును బ్యాంకు నేరుగా నాలుగు సప్లయింగ్ కంపెనీలకు బదిలీ చేసిందని, అయితే, బ్యాంకు జరిపిన ఆడిటింగ్‌లో ఆ ఇన్‌వాయిస్‌లను ఫోర్జరీ చేసినట్లు వెల్లడి అయిందని ఆ వర్గాలు వివరించాయి. బోగస్ ఇన్‌వాయిస్‌లతో సొమ్ము స్వాహా చేసిన నాలుగు కంపెనీల వివరాలూ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయని, అవి ఎవరివి? వాటి వెనక ఎవరున్నారు? బ్యాంకులను కొల్లగొట్టిన 304 కోట్ల రూపాయలూ ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి.సుజనా గ్రూప్‌తో అనుబంధం
కల్యాణ్ రావు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌లో చేరడానికి ముందు సుజనా గ్రూప్ కంపెనీల్లో పని చేశారు. సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పవర్ (గంగికొండన్), సుజనా పవర్ (ట్యుటికోరిన్), సుజనా పవర్ ఇండియా, సుజనా హోల్డింగ్స్‌ల్లో 2007 నుంచి 2010 మధ్య డైరెక్టర్‌గా పని చేశారు.
ఇంతకూ యజమాని ఎవరు ?
బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్‌లో శ్రీనివాస్ కల్యాణ్ రావు కేవలం ఉద్యోగి మాత్రమేనా లేక కంపెనీలో ఆయనకు కూడా వాటాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. కంపెనీ షేర్ హోల్డర్ల వివరాలను పరిశీలిస్తే ప్రత్యక్షంగా ఆయనకు వాటాలు లేవన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ కంపెనీలో 11 మంది వాటాదారులున్నారు. వారిలో మేకా రామకృష్ణవర్మకు 20.79 శాతం వాటా ఉండగా, వెలుగు పవర్ సొల్యూషన్స్ అనే కంపెనీకి 30 శాతం వాటా ఉంది. (శ్రీనివాస కల్యాణ్ రావు ఈ వెలుగు కంపెనీలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు). అలాగే, భాగ్యనగర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 29.10 శాతం వాటా, సీషెల్స్ కేంద్రంగా ఉన్న మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు 12.37 శాతం వాటా ఉన్నాయి. సీషెల్స్ కంపెనీకి యల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి యజమానిగా ఉన్నట్టు తెలిసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్‌లో డైరెక్టర్‌గా ఉన్న మేకా రామకృష్ణవర్మ కూడా గతంలో సుజనా గ్రూప్ కంపెనీల్లో డైరెక్టర్‌గా పని చేయడం గమనార్హం.
Tuesday, 23 February 2016
ఆ నాలుగు కంపెనీలు ఎవరివి!?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment