తెనాలి : కృష్ణా పశ్చిమ డెల్టాలో తాగు నీటి చెరువులను నింపే ప్రక్రి య కొనసాగుతోంది. అయితే కాల్వలలో నీటి ప్రవాహం తక్కువగా ఉం డటంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా చెరువులకు అతి కష్టంపై నీటిని మళ్లిస్తున్నారు. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల తగ్గింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం ఎనిమిది అడుగులకు పడిపోవడంతో పశ్చిమ డెల్టాకు గురువారం కేవలం 916 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఇస్తున్నారు. డెల్టాలో తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి నాలుగు టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు. ఈ ప్రవాహం పులిచింతల దాటి బ్యారేజీకి చేరుకునే సరికి మూడు టీఎంసీలకు మించి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ కొద్ది నీటితోనే గుంటూరు, కృష్ణా, ప్రకా శం జిల్లాలలోని చెరువులను నింపాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడింది.
పడిపోయిన బ్యారేజీ నీటిమట్టం.. కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ నెల 13వ తేదీ నుంచి తాగు నీటిని విడుదల చేశారు. తొలుత 1516 క్యూసెక్కులతో ప్రారంభించి 2400 క్యూసెక్కుల వరకు నీటి సరఫరా పెంచారు. ఈ నీటితో చెరువులను నింపుతున్న తరుణంలో కాల్వలలో నీటిమట్టం పడిపోయింది. పశ్చిమ డెల్టా పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 120 తాగునీటి చెరువులు, నాలుగు మున్సిపల్ పట్టణాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. కాల్వలకు విడుదల చేస్తున్న నీటితో వీటిని నింపుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. చెరువులు 50 శాతం కూడా నిండక మునుపే కాల్వలకు నీటి సరఫరా తగ్గిపోవడంతో అడుగంటిన నీటినే చెరువులకు పెడుతున్నారు. కాల్వలకు నీటి విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పడిపోయింది. దీంతో పులిచింతల నుంచి మళ్లీ బ్యారేజీకి నీటి విడుదల ప్రారంభించారు. ఫలితంగా గురువారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరిగి 8.4 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ నీటిమట్టం మరింత పెరిగిన తర్వాత కాల్వలకు నీటి విడుదల పెంచుతామని అధికారులు చెబుతున్నా పులిచింతలలో నీరు కూడా అడుగంటిపోతుండటంతో చెరువులను పూర్తి స్థాయిలో నింపడం కష్టసాధ్యంగా కనపడుతోంది.
కొన్ని కాల్వలకు విడుదల కాని నీరు..
డెల్టాలో చెరువులను నింపే విషయంలో సమన్వయ లోపం కూడా కనిపిస్తోంది. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువులు నింపక ముందే కొన్ని కాల్వలపై ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. దీంతో ఆ కాల్వల ద్వారా నీటి విడుదల సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. నిజాంపట్నం, పడమర కాల్వలకు ఆయా కాల్వల ముఖద్వారం నుంచి ఇంత వరకు చుక్క నీరు విడుదల జరగలేదు. నిజాంపట్నం కాల్వకు ఇంటూరు వద్ద తూర్పు కాల్వ నుంచి సప్లిమెంట్ ద్వారా నీరు మళ్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పడమర కాల్వకు మాత్రం నీటి విడుదల జరగకపోవడంతో ఈ కాల్వ కింద ఉన్న చెరువులను నింపే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది. నిజాంపట్నం, పడమర కాల్వలపై తెనాలి వద్ద ఆధునికీకరణ పనుల్లో భాగంగా వంతెన పనులు చేపట్టారు. దీంతో ఈ కాల్వలకు నీటి విడుదలకు అవరోధంగా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని బట్టి డెల్టా కాల్వలకు మరో మూడు రోజులు మాత్రమే నీటిని కొద్దో గొప్పో సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ లోపుగానే చెరువులను నింపని పక్షంలో వేసవిలో తాగునీటి ఎద్దడికి గురికాక తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.ఫ రెండో రోజు 26 వేల మంది సందర్శన
No comments:
Post a Comment