పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

ముగిసిన ఎన్‌కౌంటర్‌

  • పాంపోర్‌లో ముగ్గురు ఉగ్రవాదులూ హతం 
  • కెప్టెన్లు తుషార్‌ మహాజన్‌, పవన్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు దాదాపు రెండు రోజులపాటు తుపాకీ మోతలతో హోరాహోరీగా సాగిన పాంపోర్‌ ఎన్‌కౌంటర్‌ ముగిసింది! ఇక్కడి ప్రభుత్వ భవనంలో నక్కిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. దీంతో ఎన్‌కౌంటర్‌ ముగిసిందని ఇటు పోలీసులు, అటు ఆర్మీ ప్రకటించాయి. భవనంలో నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నామని ప్రకటించాయి. సోమవారం ఆర్మీ పెద్దఎత్తున బలగాలను మోహరించిం ది. ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి మోర్టార్లను ఉపయోగించింది. ఈ కాల్పులతో భవనంలో ఐదో అంతస్తుకు నిప్పు అంటుకుంది. దాంతో ఉగ్రవాదులు భవనంలోని ఒక పక్కకు వచ్చేశారు. అక్కడే వారిని వ్యూహాత్మకంగా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు విదేశీయులని, ఆత్మాహుతి దళాలు కావచ్చని భావిస్తున్నామని ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న విక్టర్‌ ఫోర్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జనరల్‌ అరవింద్‌ దత్తా తెలిపారు. ఈ దాడి లష్కరే తాయిబా పని కావచ్చని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రకాశ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. కాగా, ఉగ్రవాదుల చేతుల్లో వీర మరణం పొందిన 9 పారా ఆర్మీ కెప్టెన్‌ తుషార్‌ మహాజన్‌ భౌతిక కాయాన్ని సోమవారం ఆయన స్వగ్రామం కూడా అయిన ఉధంపూర్‌లోని ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ డీఎస్‌ హుడా సహా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. తుషార్‌ భౌతిక కాయాన్ని చూసి ఆయన తల్లి ఒక్కసారిగా బోరుమన్నారు. శవపేటికను పట్టుకుని స్పృహతప్పి పడిపోయారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే కెప్టెన్‌ పవన్‌కుమార్‌ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం హరియాణాలోని బధానాకు తీసుకొచ్చారు. ఆర్మీ విజ్ఞప్తి మేరకు జాట్‌ ఆందోళనకారులు రోడ్లపై దిగ్బంధాలను తొలగించి సహకరించారు. ఒకే ఒక కుమారుడిని దేశానికి ఇచ్చేయడం తనకు గర్వకారణమని పవన్‌ తండ్రి రాజ్‌బీర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ అంత్యక్రియలకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

No comments:

Post a Comment