‘కాపు గర్జనకు అన్నివిధాలా నేనే బాధ్యుడిని. తొలి ముద్దాయి గా నన్నే జైల్లో పెట్టండి’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ‘విచారణ పేరుతో పోలీసులు పిలిస్తే ముందుగా ముద్రగడను అరెస్టు చేయండని చెప్పండి’ అంటూ కాపు సంఘం నాయకులకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా కశింకోటలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోనూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హామీలు అమలు చేయండి, మాకు న్యాయం చేయండి’ అని అడిగితే తమను సంఘవిద్రోహ శక్తులుగా, తాలిబాన్లుగా చూడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న కాపు సంఘం నాయకులను పోలీసులు తరచూ స్టేషన్‌కు పిలిచి వేధించడం సబబుకాదని, పది రోజులు గడువు ఇస్తే తుని లో జరిగిన గర్జనకు హాజరైనవారి పేర్లు, వాహనాలు సమకూర్చినవారి వివరాలు తానే ఇస్తానని చెప్పారు. ఈ విషయమై సీఎం, డీజీపీలకు లేఖ రాశానన్నారు. విచారణ పేరుతో పోలీసులు పిలిచినప్పుడు వారితో తగవుకు దిగొద్దని కాపు నాయకులకు సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలులో జాప్యం జరగడంతోనే తునిలో గర్జనకు పూనుకున్నామన్నారు. కాపు రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ సోమవారం సీఎం చంద్రబాబుకు మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే హామీల అమలుకు చర్యలు ప్రారంభించినట్లయితే కాపులు రోడ్డెక్కవలసిన పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు.
No comments:
Post a Comment