పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Thursday, 18 February 2016

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన



రాజధాని అమరావతి నిర్మాణంలో తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం 8:23 గంటలకు శాసో్త్రక్తంగా శంకుస్థాపన చేశారు. అనంతరం స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన చక్రపాణి, మంత్రులు, అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత వేద పండితుల నుంచి ఆశీర్వచనాలను అందుకున్నారు. శంకుస్థాపన అనంతరం రెండు మెట్లు పైకి ఎక్కి సీఎం చంద్రబాబునాయుడు శిరస్సు వంచి మోకరిల్లి తలను భూమికి అంటించి దాదాపు నిమిషానికి పైగా ప్రార్థించారు. భూములిచ్చిన వారి భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు ప్రపంచ పటంలో దేదీప్యమానంగా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న చంద్రబాబు మాటలకు రైతులు జేజేలు పలికారు. పలు ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర మట్టి -నీరును ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం పునాదిలో వేశారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్‌, నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, మీసాల గీత, జడ్పీ చైర్‌పర్సన జానీమూన్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, వర్ల రామయ్య, బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ పాల్గొన్నారు.
12 గంటల్లో ఏర్పాట్లు పూర్తి 
తుళ్ళూరు: తాత్కాలిక సచివాలయం శంకుస్థాపనకు అధికారులు కేవలం 12 గంటల్లోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం తెల్లారేసరికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో శంకుస్థాపన కార్యక్రమం ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా ముగిసింది.

No comments:

Post a Comment