పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

అబ్బాయిలు భళా... అమ్మాయిలు డీలా..



  • చైనాపై భారత్ పురుషుల జట్టు విజయం 
  • జపాన్‌ చేతిలో మహిళలు చిత్తు
  • నేడు క్వార్టర్స్‌
  • ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ 
హైదరాబాద్‌ : తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత్ షట్లర్లకు రెండో మ్యాచ్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల జట్టు చైనా డ్రాగన్లకు చెక్‌ పెట్టగా, మహిళలు జపాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయి నిరాశపరిచారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా గురువారం జరిగిన పురుషుల గ్రూప్‌-ఎ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత 3-2తో చైనా ద్వితీయ శ్రేణి జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. కానీ, మహిళల గ్రూప్‌-డి పోరులో భారత్ 0-5తో జపాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటికే రెండు జట్లు క్వార్ట ర్స్‌కు చేరుకున్నందున ఈ మ్యాచ్‌లు నామమాత్రమే అయ్యాయి.
 
శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో మలేసియాతో పురుషులు, కొరియాతో మహిళలు పోటీ పడనున్నారు. చైనాతో పోరులో భారత డబుల్స్‌ షట్లర్లు నిరాశ పరిచారు. అయితే స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత, అజయ్‌ జయరామ్‌, ప్రణయ్‌ సింగిల్స్‌లో నెగ్గి జట్టును గెలిపించారు. తొలి సింగిల్స్‌లో తొమ్మిదో ర్యాంకర్‌ శ్రీకాంత్ 21-11, 21-17తో హోవై తియాన్‌ను ఓడించి శుభారంభం అందించా డు. కానీ, తొలి డబుల్స్‌లో మను అత్రి-సుమీత రెడ్డి జోడీ ఓడిపోవడంతో స్కోరు సమమైంది. రెండో సింగిల్స్‌లో 25వ ర్యాంకర్‌ అజయ్‌ జయరామ్‌ 22-20, 15-21, 21-18తో 11వ ర్యాంకర్‌ జెంగ్‌ మింగ్‌ వాంగ్‌పై ఉత్కంఠ విజయం సాధించాడు. అయితే రెండో డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా- అక్షయ్‌ దేవాల్కర్‌ ద్వయం కూడా ఓడిపోవడంతో స్కోరు మరోసారి సమమైంది. కానీ, నిర్ణాయక మూడో సింగిల్స్‌లో ప్రణయ్‌ 21-14, 21- 10తో యుకి షిని చిత్తు చేసి జ ట్టును గెలిపించాడు.
 
సింధు నిరాశ: సైనా గైర్హాజరీ తో జట్టును నడిపించే బాధ్యత తీసుకున్న టాప్‌ షట్లర్‌ సింధు ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచింది. 12వ ర్యాంకర్‌ సింధు 21-18, 12-21, 12-21తో తొమ్మిదో ర్యాంకర్‌ నొజోమి ఓకుహరా చేతిలో పరాజయం పాలైంది. జట్టుకు శుభారంభం దక్కక పోవడంతో డీలాపడిన జట్టు ఆపై పుంజు కోలేకపోయింది. తర్వాతి సింగిల్స్‌లో పీసీ తులసి 22-24, 14-21తో సయాకా సటోపై, యువ షట్లర్‌ రుత్వికా శివాని 25-23, 14-21, 14-21తో హషిమొంటోపై ఓడిపోవడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఇక డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 12-21, 18-21తో మిసాకి ముసుతొమో-అయాక తకాహషి ద్వయం చేతిలో వరుస గేమ్‌ల్లో ఓడింది. చివరి మ్యాచ్ లో సిక్కిరెడ్డి-పీవీ సింధు కూడా 21-18, 11-21, 16-21తో షిజుకా-మమి నయిటో చేతిలో పోరాడి ఓడిపోవడంతో భారత వైట్‌వాష్‌కు గురైంది.

No comments:

Post a Comment