పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

కల్లోలానికి కేరాఫ్‌..


తుఫాను తీరం దాటేటప్పుడు పెను విధ్వంసమే సృష్టిస్తుంది..! దాని తీవ్రత అల్ల కల్లోలంగానే ఉంటుంది..! న్యూజిలాండ్‌ విధ్వంసక వీరుడు.. రికార్డుల్లో ట్రెండ్‌ సెట్టర్‌.. బ్రెండన్‌ మెకల్లమ్‌ కూడా అదేపని చేశాడు..! కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతున్న ఈ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ కల్లోలానికి చెరగని చిరునామా తానేనని.. విధ్వంసం చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రం నుంచీ ఒక్కటి కూడా మిస్‌ కాకుండా సెంచరీ దాటేసిన ఈ అలుపెరగని వేటగాడు.. అలాంటి దృఢ సంకల్పంతోనే తుది కంటా నిలిచాడు. ‘చావో.. రేవో..’ ధోరణితోనే కెరీర్‌ ఆసాంతం సాగాడు. కివీస్‌ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన బ్రెండన్‌.. కెరీర్‌ ఉచ్ఛదశలోనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చివరి టెస్ట్‌లోనూ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ రికార్డును బద్దలు కొట్టి.. బ్రెండన్‌ అంటే బ్రాండ్‌ అనేంత గ్రాండ్‌గా వీడ్కోలుకు సిద్ధమయ్యాడు..!

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం) : కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్నాడంటే.. ఏ ఆటగాడినైనా భావోద్వేగాలు చుట్టుముడతాయి. కానీ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ స్టయిల్‌ ఎప్పుడూ ఒక్కటే.. పెను విధ్వంసం. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో దశాబ్దానికిపైగా సాగిన కెరీర్‌కు అల్విదా పలకనున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప గుణం మెకల్లమ్‌ సొంతం. ‘నేనెప్పుడూ గ్రేట్‌ ప్లేయర్‌ను కావాలనుకోలేదు. జట్టు అవసరాలకు తగిన విధంగా ఆడాలనేదే నా పాలసీ’ అని బ్రెండన్‌ అంటుంటాడు. 2004లో తొలి టెస్ట్‌ క్యాప్‌ అందుకున్న మెకల్లమ్‌.. ఇప్పటి వరకు ఆ క్యాప్‌ను భద్రంగా చూసుకోవడం అతడి నైజానికి నిదర్శనం. అలాగే బ్రెండన్‌ ధనాధన్‌ ఆట కూడా మారలేదు.
 
‘సిక్సర’ పిడుగు
బూజు పట్టిన విధానాలకు టాటా చెప్పిన డేర్‌ డెవిల్‌ మెకల్లమ్‌. తాడో పేడో ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ ఫలితాన్ని అమాంతంగా మార్చేయడంలో తనదైన శైలిని సృష్టించుకున్నాడు. సిక్సర్లు కొట్టడం అతనికి బ్యాట్‌తో పెట్టిన విద్య. 2012లో కివీస్‌ జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత బ్యాటింగ్‌ కల్లోలానికి కింగ్‌గా మారాడు. 2014లో బ్రెండన్‌ బ్యాటింగ్‌కు ఎదురులేకుండా పోయుంది. ఆ ఏడాదిలోనే ఓ ట్రిపుల్‌, రెండు డబుల్‌ సెంచరీలతోపాటు మరో ఇన్నింగ్స్‌లో 195 పరుగులు సాధించాడు. వన్డేల్లో సిక్సర్ల డబుల్‌ సెంచరీ, టెస్ట్‌ల్లో సిక్సర్ల సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా మెకల్లమ్‌ రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 101వ టెస్ట్‌ ఆడుతున్న మెకల్లమ్‌.. 6428 పరుగులు సాధించాడు. అందులో 31 అర్ధ శతకాలు, 12 సెంచరీలున్నాయి. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (7,172) తర్వాత అత్యధిక రన్స్‌ చేసిన కివీస్‌ ఆటగాడు అతడే. వన్డేల్లో టాప్‌-3లో ఉండగా.. టీ20ల్లో 2140 రన్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు.
 
అత్యుత్తమ ట్రిపుల్‌..
భారతతో జరిగిన మ్యాచ్‌లో.. 302 పరుగులతో టెస్ట్‌ను కాపాడిన ఇన్నింగ్స్‌ మెకల్లమ్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 94/5తో పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు బ్యాటింగ్‌కు దిగిన మెకల్లమ్‌.. 13 గంటలపాటు క్రీజులో నిలిచి ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు.
 
అదే మలుపు తిప్పింది..2012లో రాస్‌ టేలర్‌ను తప్పించి మెకల్లమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా టూర్‌ తొలి టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 45 పరుగులకే కుప్పకూలడం బ్రెండన్‌లో కసిని పెంచింది. దీంతో ధృడ నిర్ణయం తీసుకున్న మెకల్లమ్‌.. జట్టులో స్ఫూర్తిని నింపడంలో సక్సెసయ్యాడు. ఆ తర్వాత ఆడిన 26 టెస్టుల్లో న్యూజిలాండ్‌ 8 మ్యాచ్‌ల్లోనే ఓడింది. గతేడాది జరిగిన వరల్డ్‌క్‌పలో మెకల్లమ్‌ నాయకత్వంలో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ ఆసాంతం మెకల్లమ్‌ తాడో-పేడో బ్యాటింగ్‌తోనే చెలరేగాడు. టైటిల్‌ ఫైట్‌ మ్యాచ్‌లో బ్రెండన్‌ త్వరగా పెవిలియన్‌ చేరడంతో కివీస్‌ పతనమైంది. వరల్డ్‌కప్‌ను సాధించకపోయినా.. న్యూజిలాండ్‌ను బలమైన జట్టుగా తయారు చేయడంలో మెకల్లమ్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 

రికార్డు గురించి తెలియదు..
టెస్టుల్లో అత్యంత వేగవంతమైన శత కం సాధించిన విండీస్‌ గ్రేట్‌ వివ్‌ రిచర్డ్స్‌ రికార్డును బద్దలు కొట్టిన సంగతి ఆ సమయంలో తనకు తెలీదని మెకల్లమ్‌ చెప్పాడు. ‘ప్రతి బంతినీ ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టాలని చూశాను. రిచర్డ్స్‌ నా ఆరాధ్య క్రికెటర్‌. ఆయనో గొప్ప ఆటగాడు. అయ్యో.. వివ్‌ను అధిగమించానే అన్న చిన్న బాధ ఉంద’ని మెకల్లమ్‌ చెప్పాడు.

No comments:

Post a Comment