శ్రీశైలం: శ్రీగిరిపై ఈ నెల 29వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11రోజులపాటు వైభవోపేతంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో రోజవారీ ఉత్సవ క్రతువులు, వాహనసేవలు, గ్రామోత్సవాల నిర్వహణకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 29న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాషా్ట్రల నుంచి కూడా భక్తులు రానున్నారు.
ఉత్సవ కార్యక్రమాలు...
29వ తేదీన ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు ఉదయం 9.15గంటలకు యాగశాల ప్రవేశం, గణపతిపూజ, పుణ్యహవాచనం, శివసంకల్పం, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం, కంకణపూజ, కంకణధారణ, అఖండ స్థాపన, రుద్రకలశస్థాపన నిర్వహిస్థారు. సాయంత్రం 5 గంటలకు అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, రాత్రి 7గంటలకు త్రిశూలపూజ మొదలైనవి జరుగుతాయి. మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ దాకా జరిగే రోజువారి సేవా కార్యక్రమాల్లో ఉదయం 7.30 గంటల నుంచి చండీశ్వరపూజ, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, స్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు, 9గంటలకు రుద్రహోమం, చండీహోమం, సాయంత్రం 5.30గంటలకు నిత్యపూజలు జరుగుతాయి.
విశిష్ఠ కార్యక్రమాలు...
7వ తేదీ మహాశివరాత్రి నాడు సాయంత్రం 7గంటలకు నందివాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 10గంటల నుంచి లింగోద్భవకాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30 గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి 12గంటలకు భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. 8వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు రథాంగపూజ, రథోత్సవం ఉంటాయి. సాయంత్రం 7గంటలకు సదస్యం, నాగవల్లి ఉంటాయి. 9వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 7గంటలకు ధ్వజావరోహణం ఉంటాయి. 10వ తేదీన రాత్రి 8.30 గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు నిర్వహిస్తారు.
రోజువారీ వాహనసేవలు...
మార్చి 1వ తేదీన భృంగివాహనసేవ, 2న హంస, 3న మయూర, 4న రావణ, 5న పుష్పపల్లకి, 6న గజవాహనం, 7న నందివాహనసేవ, 8న రథోత్సవం జరుగుతాయి.
పట్టు వస్త్రాల సమర్పణ...
మార్చి 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తుంది. 4వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పిస్తుంది.
No comments:
Post a Comment