బిహార్‌లో బీజేపీ పరాజయం మన మంచికే అంటూ టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బహిరంగంగా బీజేపీ ఓటమిని టీడీపీ నేతలు సమర్థించకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఈ ఫలితాలు రాష్ట్రానికి మేలు చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. బిహార్‌లో తగిలిన ఎదురుదెబ్బతో ఏపీకి ఇచ్చిన హామీల అమలపై ప్రధాని మోదీ దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నేతలు సాకులు చెప్పి తప్పించుకొనేందుకు ఇకపై ఆస్కారం ఉండదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ‘ఇంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా.. ప్యాకేజీ అంశాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ బిహార్ ఎన్నికల తర్వాత చూస్తామంటూ కేంద్రం, బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు బిహార్ ఎన్నికలు పూర్తికావడంతో ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వారు పేర్కొంటున్నారు.
బిహార్‌లో బీజేపీ విజయం సాధించి ఉంటే మరికొంత కాలం పాటు హామీల అమలు కోసం ఎదురుచూడాల్సి వచ్చేదన్న అభిప్రాయం టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘బిహార్‌లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఎన్నికల్లో నితీష్‌కుమార్ దీన్ని ప్రస్తావించారు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా అంశాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. రూ.1.25 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఓటర్లను ఆకర్షించాలని చూశారు. ఒక వేళ ఇది మంచి ఫలితం ఇచ్చి ఉంటే రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని మోదీ పక్కన పెట్టి ఉండేవారు’ అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి మోదీ ప్రధాని అయిన తర్వాత ఆంధ్రప్రదేశకు అనుకున్నంత సహాయం అందలేదు. అయినా సరే సీఎం చంద్రబాబు కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే.. రాషా్ట్రనికి నిధులు రాబట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ సమయంలో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ఒత్తిడులు వస్తున్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. దీనిపై టీడీపీ నేతలు బహిరంగంగానే బీజేపీపై విమర్శలకు దిగినప్పటికీ చంద్రబాబు కేంద్రంతో సత్సంబంధాలు దెబ్బతినకూడదని పార్టీ శ్రేణుల్ని వారించారు. ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న జాప్యం పార్టీపై కొంత వ్యతిరేకతకు దారి తీస్తున్నా చంద్రబాబు ఇప్పటివరకూ బీజేపీని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడకుండా సంయమనం పాటించారు.
బిహార్‌లో మహాకూటమి గెలుపుతో ప్రాంతీయ పార్టీల బలం బీజేపీకి తెలిసి వచ్చిందని పలువురు రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇక నుంచైనా ప్రాంతీయ పార్టీల బలాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ వ్యవహరిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్నాళ్లూ తనకు తిరుగులేదని భావించిన ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇక నుంచైనా మోదీ మిత్రపక్షాలతో సానుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్నా’ అని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా బిహార్ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ రాషా్ట్రనికి సానుకూలంగా ఉంటాయని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న విభజన చట్టంలోని హామీల అమల్లో వేగం పెరుగుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
బిహార్‌లో మహాకూటమిని విజయపథంలో నడిపిన నితీశ్ కుమార్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నితీశకు ఫోన చేసిన బాబు ఆయన్ను అభినందించారు. నితీశ్ తో చంద్రబాబుకు ముందు నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. నితీశ్తో ఉన్న స్నేహంతో ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు ఆయనకు ఫోన చేశారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
No comments:
Post a Comment