- సంక్లిష్టతలుండడంతో ప్రతిపాదన ఉపసంహరణ
- నీటిని వెనక్కు తోడిపోసేలా గోదావరిలో 5 బ్యారేజీలు
- నీటిపారుదల శాఖలో కొత్తగా 108 ఉద్యోగాల భర్తీ
- ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్
గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల నుంచి 2017 నాటికి తొలిదశలో సాగు నీరు అందించాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కాశేశ్వరం ఎత్తిపోతలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, ఈఎనసీ మురళీధర్, ఓఎస్‌డీ శ్రీధర్‌దేశపాండే, ముఖ్య అధికారులు హరిరామ్, పురుషోత్తంరాజు, అనిల్‌కుమార్, గోవిందరావు, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా 160 టీఎంసీలను ఎల్లంపల్లికి మళ్లించడం కోసం ప్రతిపాదించిన మార్గంలో అనేక సంక్లిష్టతలుండడంతో ఆ పథకాన్ని సీఎం పక్కన పెట్టేశారు. దాదాపు 150 క్రాసింగులు ఉండడంతో.. రెండేళ్లలో దానిని పూర్తి చేయడం అసాధ్యం అని భావించారు. దానికి ప్రత్యామ్నాయంగా గోదావరి నదిలోనే దిగువ నుంచి ఎగువకు ఎల్లంపల్లి వరకు వరుసగా ఐదు బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 10 మీటర్ల ఎత్తులో పంపులు నిర్మించి నీటిని ‘వెనక్కు తోడిపోస్తూ’ ఎల్లంపల్లికి నీటిని ఇవ్వాలన్న అంశాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సమావేశంలో పాల్గొన్న అందరూ ముక్తకంఠంతో అంగీకారం తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఒక బ్యారేజీ, మెదక్ జిల్లాలోని తడకపల్లి నుంచి నిజాంసాగర్ వరకు మరో బ్యారేజీని, తుమ్మిడిహెట్టి, సింగారెడ్డిపల్లి, బీరవెల్లి, తుపాకుల గూడెం(కొత్తూరు) నీరందించేలా కొత్తూరు వద్ద ఏకకాలంలో బ్యారేజీ నిర్మాణం జరగాలని ప్రతిపాదించారు. వాటికి అదనంగా మరో రెండు బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటికీ ఈ డిసెంబరులోనే శంకుస్థాపన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా బ్యారేజీల నిర్మాణ పనులు, రివైజ్ పనులను ఇప్పుడున్న ఈపీసీ సంస్థలకే నామినేషన పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించారు. వీటన్నిటినీ రెండేళ్లలో పూర్తిచేయాలని నిశ్చయించారు. అలాగే సోమవారం జరిగే మరో సమావేశంలో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రాజెక్టులపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. రాజీవ్‌సాగర్, ఎత్తపోతల పథకం, ఇందిరాసాగర్ ఎత్తిపోతల ఈ రెండింటినీ కలిపి ఒకే ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా, రిజర్వాయర్లతో పాటు కాలువలు, సొరంగాలు, లిఫ్టుల పనులు సమాంతరంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ రైతాంగం రెండు పంటలు పండించి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలూ కాంట్రాక్టర్లతో పనిచేయించాలని, వారికి బిల్లులనూ సకాలంలో చెల్లించేలా చూడాలని చెప్పారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించాలన్నారు. భూ సేకరణను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల వద్ద భూసేకరణ పరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నీటి పారుదల శాఖకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని, కాబట్టి నిధుల కొరత అనే సమస్య లేదని, పనులు వేగంగా పూర్తవడమే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక ్టర్ల విషయంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. కాంట్రాక్టర్లు తక్కువ కోట్‌తో టెండర్లను దక్కించుకుని ఆ తర్వాత పనులు చేయకుండా వదిలేస్తే ప్రభుత్వానికి నష్టం కలుగుతుం దన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రెండు శాతం ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏళ్లకు..ఏళ్లు సాగదీయడం ఆనవాయితీగా మారిందని, కానీ, తెలంగాణలో మాత్రం రెండు, మూడేళ్లలోనే పూర్తై పొలాలకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.
నీటి పారుదల శాఖలో 108 పోస్టులు
కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఎస్‌ఆర్‌ఎస్‌పీ వంటి పాత ప్రాజెక్టులను పటిష్ఠం చేస్తున్నందున అందుకు అవసరమైన అధికారులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీనియర్ అధికారు లందరికీ పదోన్నతులు కల్పించాలన్నారు. కొత్తగా 108 ఉన్నతాధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రస్తుతమున్న 14 మంది సీఈలకు తోడుగా మరో 8 మంది, 39 మంది ఎస్‌ఈలకు అదనంగా ఏడుగురిని, 183 మంది ఈఈలకు అదనంగా 21 మందిని, 619 డీఈఈలకు అదనంగా 55 మందిని, 15 మంది డివిజనల్ అకౌంట్స్ అధికారులను, ఇద్దరు ఛీఫ్ అకౌంట్ ఆఫీసర్ల పోస్టులను సీఎం మంజూరు చేశారు
No comments:
Post a Comment