ఒకప్పుడు కొత్త దర్శకులకు అచ్చొచ్చిన కథానాయకుడుగా పేరు సంపాదించాడు జూనియర్ యన్టీఆర్. ఆ తీరున యన్టీఆర్‌తో తొలి చిత్రాలు తీసిన రాజమౌళి, వినాయక్ టాప్ డైరెక్టర్స్‌గా మారారు... అదేమి చిత్రమో ఆ తరువాత నుంచీ జూనియర్ కొత్తవారిలోని ప్రతిభను ప్రోత్సహించకుండా సక్సెస్ ఉన్న వారివెంటే పరుగులు తీస్తున్నాడు. ఆ పరుగులో పలుమార్లు పల్టీలు కొట్టడం గమనార్హం. 'శివమణి' వంటి హిట్ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ నటించిన 'ఆంధ్రావాలా' బోల్తా కొట్టింది. ఇక 'నరసింహనాయుడు' బంపర్ హిట్ తరువాత బి.గోపాల్ డైరెక్షన్‌లో బుల్లి రామయ్య నటించిన 'అల్లరి రాముడు' ఫర్వాలేదనిపించింది. 'అతనొక్కడే' విజయం తరువాత సురేందర్ రెడ్డితో 'అశోక్'లో నటిస్తే ఆకట్టుకోలేకపోయింది. 'దూకుడు' తరువాత శ్రీను వైట్లతో 'బాద్ షా' అంటూ సాగితే ఫలితం షరా మామూలే. 'సింహా' తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో జూనియర్ నటించిన 'దమ్ము' బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపించలేకపోయింది. ఇలా సక్సెస్ వెంటే పరుగులు తీస్తున్న జూనియర్‌కు కోరుకున్నది లభించడం లేదు...
జూనియర్‌ను వీడని సెంటిమెంట్
సక్సెస్ వెంట పరుగులు తీసిన ప్రతీసారి జూనియర్‌కు నిరాశే మిగిలింది.... ఇప్పటి వరకు సక్సెస్ ఉన్న రాజమౌళితో సాగించిన ప్రయాణంలోనే 'యమదొంగ' లాంటి ఘనవిజయం దరి చేరింది... ఆ తరువాత ఎవరు విజయం సాధిస్తే వారి వెంట పరుగులు తీసినా లాభం లేకుండా పోయింది... జూనియర్‌కు అదో సెంటిమెంట్ గా మారింది... అయితే ఇక్కడే మరో సెంటిమెంట్ కూడా ఉందట... ఫ్లాపుల్లో ఉన్న వారి వెంట జూనియర్ సాగితే, సక్సెస్ వచ్చిన సందర్భం ఉందని కొందరు చెబుతున్నారు... అలా సాగిన సందర్భం ఏదంటే- 'మున్నా' ఫ్లాప్ తో ఉన్న వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో జూనియర్ 'బృందావనం'లో నటించాడు... అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది...అదే తీరున ఇప్పుడు రానున్న 'నాన్నకు ప్రేమతో' దర్శకుడు సుకుమార్ ఇంతకు ముందు ఫ్లాపులో ఉన్నాడు... మరి జూనియర్ సెంటిమెంట్ ప్రకారం 'నాన్నకు ప్రేమతో' విజయం సాధిస్తుందా?... అన్నట్టు మరో సెంటిమెంట్ ఉందిగా, 'మిర్చి, శ్రీమంతుడు'తో వరుసగా ఘన విజయాలు చూసిన కొరటాల శివ డైరెక్షన్‌లోనూ యంగ్ టైగర్ నటిస్తున్నాడు... మరి ఈ రెండు సినిమాల ఫలితం ఎలా ఉంటుందో? జూనియర్ సెంటిమెంట్ నిజమవుతుందో కాదో చూడాలి...
No comments:
Post a Comment