దసరా, దీపావళి పండగలు సైతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోని నగల వ్యాపారులను నిరాశ పరిచాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 50 శాతం పడిపోయాయి. చిన్న చిన్న నగలు తప్ప, పెద్ద నగలు ఎవరూ కొనడం లేదని ఎపి బులియన్ వ్యాపారుల సంఘం (ఎపిబిఎంఎ) అధ్యక్షుడు విజయ్ కుమార్ చెప్పారు. ధన త్రయోదశితో హైదరాబాద్‌లో మాత్రం కొద్దిగా డిమాండ్ పెరిగింది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ డిమాండ్ కనిపించ లేదు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రభావం సైతం, బంగారు నాణేల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో పెట్టుబడి లాభాల కోసం బంగారం కొనేవారు పూర్తిగా కరువయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు ఒక శాతం కూడా లేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఖరీఫ్ పంట దెబ్బతినడంతో గ్రామీణ డిమాండ్ బాగా పడిపోయింది. రెండు పంటలు దెబ్బతినడంతో సన్న, చిన్నకారు రైతు కుటుంబాలు పెళ్లిళ్లకు సైతం పెద్దగా నగలు కొనేందుకు సాహసించడం లేదు. దీపావళికి ముందు ఏర్పడిన తుఫాను, భారీ వర్షాలు సైతం ఆంధ్ర ప్రదేశ్‌లో నగల అమ్మకాలను దెబ్బతీశాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
నగల వ్యాపారంలో కార్పొరేట్ సంస్థలతో చిన్న చిన్న వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం నగల వ్యాపారంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో దాదాపు 80 శాతం వ్యాపారం కార్పొరేట్ సంస్థలదేనని విజయవాడ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (విబిజెఎ) జాయింట్ సెక్రటరీ శ్రీహరి సత్యనారాయణ చెప్పారు. అయితే ఈ సంస్థల వ్యాపారం సైతం అంతంత మాత్రంగానే ఉంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో తప్ప, మిగతా సమయాల్లో షాపుల నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక కార్పొరేట్ జ్యుయలరీ సంస్థ ప్రతినిధి చెప్పారు. రబీ పంట ఆశాజనకంగా ఉంటే తప్ప గ్రామీణ ప్రాంతం నుంచి నగలకు డిమాండ్ పెరిగే అవకాశం లేదని మార్కెట్ వర్గాల అంచనా
No comments:
Post a Comment