- రియల్టీ, ఏవియేషన్‌లో నిబంధనల సడలింపు,ప్లాంటేషన్స్‌లో 100 శాతం అనుమతి
- పెట్టుబడుల ఆకర్షణే తమ ఎజెండా అని ప్రకటించిన ప్రభుత్వం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు సంబంధించి ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టింది. మొత్తం 15 రంగాల్లో ఎఫ్‌డిఐలకు సంబంధించి పలు నిబంధనలను పూర్తిగా సరళతరం చేసిం ది. ఎన్‌ఆర్‌ఐలు వారి కంపెనీలు కూడా స్వదేశంలో మరింత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాట్లు కల్పించారు. ఎఫ్‌డిఐ నిబంధనలను సరళతరం చేసిన రంగాల్లో రియల్ ఎస్టేట్, మైనింగ్, పౌరవిమానయానం, బ్యాంకింగ్, రిటైల్, రక్షణ, న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ రంగాలున్నాయి. ఎఫ్‌డిఐకి సంబంధించి ప్రభుత్వం ఈ స్థాయిలో పెను సంస్కరణలను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఎఫ్‌డిఐ పరిమితులను పెంచడంతో పాటు ఆమోద ప్రక్రియను మరింత సరళతరం చేశారు.
బిహార్ ఎన్నికల్లో ఎన్‌డిఎ పరాజయాన్ని చవిచూసిన రెండు రోజుల్లోనే దూకుడుగా ఎఫ్‌డిఐ సంస్కరణలను ప్రకటించడం విశేషం. బిహార్ ఓటమి వల్ల సంస్కరణల విషయంలో ప్రభుత్వం వెనకడుగువేస్తుందన్న భయాలు ఈ దెబ్బతో దూరమయ్యాయి. బుధవారం నాడు ప్రధాని తొలిసారిగా బ్రిటన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో పెట్టుబడులను ఆకట్టుకోవడం, ద్వైపాక్షిక వాణిజ్యం పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. తర్వాత టర్కీలో జరగనున్న జి 20 సమావేశాలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలకు ముందు ఆయన సమయోచితమైన సంకేతాలను ఇన్వెస్టర్లకు పంపారని ఎనలిస్టులు కితాబునిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లకు ఇది మోదీ సర్కారు దీపావళి కానుక అని వా రు వర్ణిస్తున్నారు. వ్యతిరేకులు మాత్రం, బిహార్ ఓటమి కూడా మోదీని మార్చకుంటే దేశాన్ని రక్షించడం కష్టమని వాపోతున్నారు. ప్రభుత్వ ఎజెండాలో దేశ ఆర్థికాభివృద్ధికే ప్రధమ స్థానం ఉంటుందని ఎఫ్‌డిఐ సంస్కరణలపై విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
మొత్తం 15 సెక్టార్లలో 32 అంశాలకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేశారు. తాజా సంస్కరణల వల్ల ప్రభావితమయ్యే వాటిలో.. ఎల్‌ఎల్‌పిలు, ఎన్‌ఆర్‌ఐల సంస్థలున్నాయి. పెద్ద ఎత్తున ఎఫ్‌డిఐలను ఆకర్షించడం ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూడకుండా ఆటోమేటిక్ మార్గాల్లో పెట్టుబడులు వచ్చిపడేలా చూడటం తాజా సంస్కరణల లక్ష్యంగా కనిపిస్తోంది.
- విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోద పరిధిలోని ఎఫ్‌డిఐ పరిమితిని 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలకు పెంచారు.
- నిధుల లేమి కారణంగా కష్టాల్లో ఉన్న నిర్మాణ రంగానికి భారీ ఊరట నిచ్చారు. కనీస మూలధనం (50 లక్షల డాలర్లు), కనీసం నిర్మాణ వైశాల్యానికి (20 వేల ఎస్‌ఎఫ్‌టి) సంబంధించిన షరతులను సడలించారు. రియల్టీలో విదేశీ ఇన్వెస్టర్ల ఎగ్జిట్ నిబంధనలను కూడా సడలించారు. భారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి దశను ఒక ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు కల్పించారు. టౌన్‌షిప్స్, మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బిజినెస్ సెంటర్స్ వంటి ప్రాజెక్టులకు సంబంధించి 100 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ రూట్‌లో గ తంలోనే అనుమతించారు. అప్పట్లో విధించిన పలు షరతులను ఇప్పుడు సడలించారు. తాజా సడలింపుల ప్రకారం ప్రాజెక్టు పూర్తికాకుండానే విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకోవచ్చు.
- రబ్బర్ , కాఫీ, యాలకులు, పామాయిల్, ఆలివ్...మొత్తం అయిదు రకాల ప్లాంటేషన్స్‌లో 100 శాతం ఎఫ్‌డిఐని ఆమోదించారు.
- ప్రాంతీయ ఎయిర్ సర్వీసుల రంగంలో 49 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ రూట్‌లో అనుమతించారు. అన్నిరకాల ఎయిర్‌లైన్స్ సంస్థల్లో 49 శాతం ఎఫ్‌డిఐ ప్రస్తుతం ప్రభుత్వ అనుమతులకు లోబడి ఉంది. ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌కు ఆటోమేటిక్ రూట్‌ను వర్తింపజేయడం వల్ల ట్రూజెట్, ఎయిర్ కోస్టా, ఎయిర్ పెగాస్ వంటి సంస్థలు లాభపడే అవకాశం ఉంది.
- నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసుల్లో ఎఫ్‌డిఐ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు.
- డిటిహెచ్, టెలిపోర్ట్స్, కేబుల్ నెట్‌వర్క్ సర్వీసుల్లో 100 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ మార్గంలో అనుమతించేందుకు నిర్ణయించారు.
- న్యూస్, కరెంట్ అఫైర్స్ టీవీ ఛానళ్లలో ఎఫ్‌డిఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. నాన్‌న్యూస్ ఛానళ్లలో100 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ మార్గంలో అనుమతించారు. ఎఫ్‌ఎం రేడియోలోనూ ఎఫ్‌డిఐని 49 శాతానికి పెంచారు.
- సింగిల్‌బ్రాండ్ రిటైల్ విభాగంలోనూ ఎఫ్‌డిఐని సరళతరం చేశారు. ఇ కామర్స్ ద్వారా ఉత్పత్తుల విక్రయానికి అనుమతించారు. ఒకే సంస్థ సింగిల్ బ్రాండ్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలను నిర్వహించేందుకు కూడా వెసులుబాటు కల్పించారు.
- డ్యూటీ ఫ్రీ షాప్స్, ఎల్‌ఎల్‌పిల్లో 100 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ రూట్‌లో అనుమతించాలని నిర్ణయించారు.
- డిఫెన్స్ ప్రాజెక్టుల్లో 49 శాతం ఎఫ్‌డిఐని ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు.
- ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల పరిమితిని 74 శాతం వరకు పెంచారు
No comments:
Post a Comment