రజనీకాంత్ 'కబాలి' షూటింగ్ ఇలా మొదలైందో లేదో ఆ సినిమా కథపై రకరకాల వార్తలు వచ్చేస్తున్నాయి. 2008లో విడుదలైన హాలీవుడ్ మూవీ 'టేకెన్' స్ఫూర్తితోనే 'కబాలి' రూపుదిద్దుకుంటోందనే వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. తన కూతుర్ని కిడ్నాపర్ల చెర నుండి రక్షించడానికి ఓ మాజీ గ్యాంగ్ స్టర్ జరిపిన పోరాటమే 'టేకెన్' మూవీ థీమ్. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఏమీ ఉండవు. కానీ, అండర్ వరల్డ్ మాఫియాతో మాజీ డాన్ చేసే పోరాటమే ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఫ్రాన్స్, యు.ఎస్. మధ్య జరిగే ట్రాఫికింగ్ కూడా ఈ సినిమాలోని ప్రధానాంశం.
'కబాలి' సినిమాను మాత్రం ఇండియా- మలేసియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మలేసియాలోనే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కథానాయిక రాధికా ఆప్టే వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొనబోతోంది. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'టేకెన్' మాతృక అని తెలిశాక... ఇది 'బాషా'కు సీక్వెల్ కాదని స్పష్టమైపోయింది. అలానే రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తాడనే ప్రచారానికీ ఫుల్ స్టాప్ పడింది. విశేషం ఏమంటే... 'టేకెన్' ఇన్ స్పిరేషన్ తోనే ఇప్పుడు వివిధ భాషల్లో మరో ఒకటి రెండు సినిమాలూ తెరకెక్కుతున్నాయట!
No comments:
Post a Comment