పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

‘బంగారం’లాంటి అవకాశం

ధన త్రయోదశి, దీపావళి.. ఈ రెండు రోజుల్లో చిన్న మెత్తు బంగారమైనా కొంటే ఏడాదంతా లక్ష్మీ దేవి ఇంట్లో కొలువై ఉంటుందన్నది నమ్మకం. ప్రస్తుతం నగల దుకాణాలు, కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. పసిడి ధర తగ్గడం సైతం ఇందుకు దోహదం చేస్తోంది. సరిగ్గా ఈ రెండు పండగలకు ముందు ప్రభుత్వం బంగారం నగదీకరణ పథకం (జిఎంఎస్‌), సావరిన గోల్డ్‌ బాండ్‌ పథకం, ఇండియా గోల్డ్‌ కాయిన పేరుతో మూడు స్వర్ణ పథకాలు ప్రకటించింది. ఇప్పుడు బంగారాన్ని బాండ్ల రూపంలో కొనడంతోపాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని నగదుగా కూడా మార్చుకోవచ్చు. వేల టన్నుల బంగారం ఇళ్లలో పేరుకుపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు వీసమెత్తు కూడా లాభం జరగడం లేదు. పైగా బంగారంపై మోజు వల్ల ఆర్థికరంగంపై భారం కూడా పడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతుగా దోహదం చేయాలనుకునేవారు, ఇంట్లో పేరుకుపోయిన బంగారాన్ని డిపాజిట్‌ చేసి దానిపై వడ్డీ కూడా పొందవచ్చు. కొత్తగా బంగారాన్ని కొనేవారు ఫిజికల్‌ రూపంలో కాకుండా బాండ్ల రూపంలో కొనడం ద్వారా ఆర్థిక రంగంపై దిగుమతుల భారాన్ని తగ్గించినవారవుతారు. అందుకని బంగారానికి సంబంధించి నిర్ణయం ఏమిటో ఈ పండగ సందర్భంగా తేల్చుకోమ్మని మార్కెట్‌ విశ్లేషకులు సూచిస్తున్నారు.
 
జిఎంఎస్‌ పథకం 
జిఎంఎస్‌ పథకాన్ని 1999నాటికి గోల్డ్‌ డిపాజిట్‌ పథకం, పునర్‌ వ్యవస్థీకరించిన గోల్డ్‌ మెటల్‌ లోన (జిఎంఎల్‌) పథకాల స్థానంలో ప్రవేశపెట్టారు. అవిభక్త హిందూ కుటుంబాలతో పాటు దేశ పౌరులు, ట్రస్టులు, సెబి గుర్తింపు ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఇటిఎ్‌ఫలు, కంపెనీలు సైతం ఈ పథకంలో చేరవచ్చు. తమ దగ్గర ఉన్న నగలు లేదా బంగారాన్ని బ్యాంకుల ద్వారా ఏడాది నుంచి 15 ఏళ్ల గడువు వరకు డిపాజిట్‌ చేయవచ్చు. కనీసం 30 గ్రాముల బంగారాన్ని ఇలా డిపాజిట్‌ చేయాలి. గరిష్ఠ పరిమితి మాత్రం లేదు. ఈ బంగారాన్ని కరిగించి నాణ్యత ఆధారంగా ఇన్వెస్టర్లకు సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఇలా డిపాజిట్‌ చేసిన బంగారాన్ని గడువుకు ముందే ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది. కాకపోతే అందుకు కొంత పెనాల్టీ పడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇలా డిపాజిట్‌ చేసే బంగారంపై డిపాజిట్‌ కాలపరిమితిని బట్టి 2.25 శాతం నుంచి 2.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. జిఎంఎస్‌ ఖాతా ప్రారంభం కోసం బ్యాంకులు, సాధారణ అకౌంట్‌ ప్రారంభించేటపుడు పాటించే ‘మీ ఖాతాదారుడి గురించి తెలుసుకోండి’ (కెవైసి) నిబంధనలన్నీ పాటిస్తాయి.
 
అర్థవంతమైన రాబడి
వివిధ సంస్థల దగ్గర నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని సేకరించి ఉత్పాదక అవసరాలకు ఉపయోగించేందుకు ప్రభు త్వం ఈ జిఎంఎస్‌ పథకం ప్రారంభించిది. దీని వల్ల దీర్ఘకాలంలో బంగారం దిగుమతుల భారమూ తగ్గుతుందని భావిస్తోంది. ఆర్‌బిఐ దగ్గర ఉండే బంగారం నిల్వలు పెరిగి, ప్రభుత్వం సేకరించే రుణాలపై ఖర్చూ తగ్గుతుంది. జిఎంఎస్‌ పథకం ద్వారా నిరర్థక ఆస్తిగా పైసా ఆదాయం సంపాదించలేని బంగారం, అర్థవంతమైన ఆదాయ వనరుగా మారుతుంది. అయితే జిఎంఎస్‌ పథకం ద్వారా వచ్చే ఆదాయంపై పన్నుల సంగతేంటనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ వడ్డీ ఆదాయానికి, ఆదాయ పన్ను చెల్లింపు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 
సావరిన గోల్డ్‌ బాండ్స్‌
పెట్టుబడి లాభాల కోసం తరచూ బంగారం కొనేవారికి సావరిన గోల్డ్‌ బాండ్‌ పథకం (ఎస్‌జిబిఎస్‌) సరైన ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు. దేశంలోని పౌరులతోపాటు అవిభక్తి హిందూ కుటుంబాలు, ట్రస్టులు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థలు సైతం ఈ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఒక్కొక్కరు కనీసం రెండు గ్రాముల నుంచి గరిష్ఠంగా 500 గ్రాముల బంగారం విలువకు సమానమైన బాండ్లు కొనాలి. వీటి కాల పరిమితి ఎనిమిదేళ్లు. ఆర్‌బిఐ ప్రకటించిన తేదీ నుంచి ఇవి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో సైతం ట్రేడవుతాయి. కాబట్టి ఎపుడు అవసరమైతే అపుడు ఈ బాండ్లను అమ్ముకుని క్యాష్‌ చేసుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి 2.75 శాతం చొప్పున ఈ బాండ్లపై వడ్డీ చెల్లిస్తారు. అయితే ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ బాండ్లపై వడ్డీ రేటు మారుతుంది. బ్యాంకు అకౌంట్‌ ప్రారంభించేటపుడు ఎలాంటి కెవైసి వివరాలు సమర్పిస్తామో ఈ సావరిన గోల్డ్‌ బాండ్స్‌ కొనేటపుడూ అలాంటి అన్ని వివరాలు సమర్పించాలి.
 
భద్రతకు ఢోకా లేదు
నాణేలు, కడ్డీల రూపంలో బంగారం కొని దాయాలంటే ప్రస్తుతం ఆషామాషి విషయం కాదు. కష్టపడి నాణ్యమైన బంగారమే కొన్నా, దాన్ని భద్రపరచడం పెద్ద సవాల్‌. ఏదో ఒక బ్యాంకులో లాకర్‌ తీసుకుని భద్ర పరచాలి. ఎక్కడికి పోతుందిలే అని ఇంట్లోనే అట్టిపెట్టుకుంటే ఏ కేటుగాడో కొట్టేసే ప్రమాదమూ ఉంది. ఒకవేళ జాగ్రత్త చేసినా బంగారం విలువ పెరిగితే మురిసి పోవాల్సిందే తప్ప, దమ్మిడి ఆదాయం రాదు.
ఇలా పెట్టుబడి లాభాల కోసం బంగారం కొనే వారికి సావరిన గోల్డ్‌ బాండ్‌ పథకం మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రభుత్వం ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఎలాంటి పన్ను రాయితీలు ప్రకటించలేదు. ఈ పథకంపై వచ్చే మూల ధన లాభాలపై, ఫిజికల్‌ గోల్డ్‌ కొని అమ్మినపుడు అమలయ్యే విధంగా 1961 నాటి ఆదా య పన్ను (ఐటి) చట్టం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఎస్‌జిబిఎస్‌ పథకం, ఫిజికల్‌ గోల్డ్‌ కంటే సముచిత రాబడులు ఇస్తుందని ఆశించవచ్చు. ఈ నెల 26న సావరిన గోల్డ్‌ బాండ్లను బ్యాంకులు, నిర్ణీత పోస్టాఫీసుల్లో కొనుగోలు చేయవచ్చు.
 
సావరిన గోల్డ్‌ బాండ్స్‌ పథకంతో వ్యక్తిగత పొదుపు స్వ రూపం మారనుంది. సంప్రదాయంగా బంగారం కొనేవారు సైతం ఇక తమ నిధులను ఉత్పాదక ప్రయోజనం ఉండే ఈ బాండ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతారు. 
-చందా కొచ్చార్‌, ఎండి, సిఇఒ, ఐసిఐసిఐ బ్యాంక్
 
బంగారు నాణేలు, కడ్డీలు కొనేవారికి సావరిన గోల్డ్‌ బాండ్‌ పథకం మంచి ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకం. దీని వలన బంగారం జాగ్రత్తగా దాచుకోవాలనే భయం కూడా ఉండదు. 
-సునీల్‌ సిన్హా, ప్రధాన ఆర్థికవేత్త, ఇండియా రేటింగ్స్‌,
 
ఈ పథకాల వల్ల బంగారం దిగుమతులు తగ్గుతాయి. అయితే నగలు కావాలనుకునే వారు మాత్రం బంగారం కొనేందుకే మొగ్గు చూపుతారు. నాణేలు, కడ్డీల అమ్మకాలు మాత్రం తగ్గుతాయి. 
-ఒ ఆషెర్‌, ఎండి, మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌

No comments:

Post a Comment