నల్గొండ : వారిద్దరూ ఇష్టపడ్డారు...ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం పెద్దలను కూడా ఎదురించారు. కానీ వారిద్దరూ ఆడపిల్లలే. తల్లిదండ్రులు నచ్చజెప్పినా... పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా కలిసే జీవితం సాగిస్తామంటున్నారు. నల్గొండ జిల్లాలో ఈ విచిత్ర సంబంధం వెలుగు చూసింది. సృష్టికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిల పేర్లు శ్రీదేవి, అన్నామణి. శ్రీదేవిది నల్లొండ జిల్లా మిర్యాలగూడ కాగా అన్నామణిది వేములపల్లి మండలం రావువారిగూడెం. ఇద్దరూ వరుసకు వదినామరదళ్లు అవుతారు.
ఈ పరిచయంతోనే ఇద్దరూ దగ్గరయ్యారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చివరకు ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న పెద్దలు సృష్టికి విరుద్ధంగా ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడం సరికాదని నచ్చజెప్పినా వినలేదు. గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకోగా పెద్దలు విడదీశారు. ఈ నేపథ్యంలో అన్నామణిని చూసేందుకు శ్రీదేవి మిర్యాలగూడకు రాగా ఆమె బంధువులు దాడి చేసి కొట్టారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి ఆరా తీయగా ఇద్దరమ్మాయిల పెళ్లి సంగతి బయటపడింది.
అమ్మాయిలు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడం సరైంది కాదని నచ్చజెప్పేయత్నం చేశారు. అయినా వారిద్దరూ మాత్రం కలిసే ఉంటామని తేల్చి చెప్పారు. ఎవరు చెప్పినా విడిపోయేందుకు శ్రీదేవి, అన్నామణి అంగీకరించకపోవడంతో వారిద్దరి నుంచి పోలీసులు సంతకాలు తీసుకుని పంపించేశారు. ఇద్దరమ్మాయిలూ మేజర్లు కావడంతో ఏం చేయాలో పోలీసులకు కూడా తోచలేదు.
No comments:
Post a Comment