- భార్యను విడిచిపెట్టి మరో మహిళతో ఎస్‌ఐ సహజీవనం
- భర్త ప్రియురాలి ఇంటి ఎదుట భార్య ధర్నా
అంబర్‌పేట : ఠాణా గుమ్మం తొక్కే ఆలుమగలకు మంచిచెడు చెప్పే కొలువు. సమాజానికి రక్షణ కల్పించే సబ్ ఇన్‌స్పెక్టర్. కానీ.. గాడి తప్పాడు.. కట్టుకున్న ఇల్లాలిని కాదని.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఏడాదికాలంగా మనోక్షోభను అనుభవిస్తున్న ఆ గృహిణి తనకు న్యాయం చేయమంటూ భర్త ప్రియురాలి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. మరోవైపు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ.. సదరు ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పరస్పర ఫిర్యాదులతో పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ 2009 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తిచేసుకుని ప్రస్తుతం అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2011లో నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన విజయరాణితో వివాహం అయింది. వీరి దాంపత్యానికి గుర్తుగా కుమార్తె పుట్టింది. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. డబ్బుకోసం వేధించటం ప్రారంభించాడని భార్య ఆరోపించింది. ఏడాదికాలంగా తననూ, కుమార్తెను పట్టిటంచుకోకుండా వేరుగా ఉంటున్నట్టు ఆమె వాపోయింది.
బాగ్‌అంబర్‌పేట ఇంద్రప్రస్థ కాలనీలో ఫార్మాసిస్టుగా ఉద్యోగం చేస్తున్న అనూషతో సహజీవనం చేస్తున్నట్టు వాపోయింది. తనకు న్యాయం చేయమని అడిగేందుకు భర్త ప్రియురాలు నివాసం ఉంటున్న జయరాజ్ అపార్ట్‌మెంట్ వద్ద కుమార్తెతో కలిసి బుధవారం ధర్నాకు దిగింది. తన భర్తను విడిచిపెట్టాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులతో కలసి ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న అంబర్‌పేట పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.
ఇరువురు మహిళలూ పోలీసులకు ఫిర్యాదు
తన ఇంటి ముందు ధర్నా చేస్తున్న విజయరాణిపై అనూష అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుటుంబ ప్రతిష్టకు భంగంకలిగిస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న ఆమె సోదరుడు రాముతో కలిసి తన ఇంట్లోకి చొరబడి దాడికిపాల్పడినట్టు వాపోయింది. రాము తనకు కత్తి చూపించి, తన చెల్లి, బావను వేరు చేస్తున్నావని వెంటనే నగరం నుంచి వెళ్లిపోవాలని... లేకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. అనూష, ఆమె సోదరుడు తనను కొట్టి గాయపరచటమేకాకుండా... కులం పేరుతో దూషించారని విజయరాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
No comments:
Post a Comment