'సర్దార్ గబ్బర్‌సింగ్' పుణ్యమా అని పవర్ ఫాన్స్ పవన్‌కళ్యాణ్‌లో కొత్త యాంగిల్‌ని చూస్తున్నారు. షూటింగ్ స్పాట్‌లో పవన్ ఎలాగుంటాడనేది ఇంతకుముందు తెలిసేది కాదు. అతని సినిమా మొదలైందంటే విడుదలకి దగ్గర పడే వరకు అందులో పవన్ ఎలా కనిపిస్తాడనే దానిపై ఐడియా కూడా వుండేది కాదు. కానీ సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ మొదలైన నాటినుంచే పవన్ కళ్యాణ్ ఫోటోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయి.
దాదాపుగా ఈ చిత్రంలో నటిస్తున్న వారు, ఈ చిత్రానికి పని చేస్తున్న సాంకేతిక నిపుణులు పవన్‌తో కలిసి ఫోటోలు దిగి వాటిని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. ఫోటో అనగానే నవ్వడానికే ఇష్టపడని పవన్ మొహమంతా సీరియస్‌గా పెట్టుకుని కనిపించేవాడు. కానీ ఈ సినిమా షూటింగ్‌లో మాత్రం పవన్ చాలా సరదాగా కనిపిస్తూ... సర్దార్ షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసేట్టు చేస్తున్నాడు.
అంతేనా, చరణ్‌కి బొకే ఇవ్వడం దగ్గర్నుంచి, చిరంజీవి ఇంటికి వెళ్లి సినీ రంగ పునఃప్రవేశంపై ఆనందం వ్యక్తం చేయడం దగ్గర్నుంచి పవన్‌లో చాలా ఛేంజ్ కనిపిస్తోంది. పవన్‌లో ఈ మార్పుని చూసి పవర్‌స్టార్ వీరాభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు.
పవన్ ఇంత సరదా వాతావరణంలో చేస్తోన్న సర్దార్ చిత్రం అవుట్‌పుట్ ఎంత గొప్పగా వుంటుందోనని ఇప్పట్నుంచే ఆశలు పెంచేసుకుంటున్నారు. వచ్చే వేసవిలో గబ్బర్‌సింగ్ రికార్డుల భరతం పట్టేస్తాడని బలంగా నమ్మేస్తున్నారు.

No comments:
Post a Comment