- అమరావతికి తరలింపుపై తొలగని సందిగ్ధం
- మానసికంగా సిద్ధమవుతున్న ఉద్యోగులు
- నాన్చుడు ధోరణిలో ఉన్నతాధికారులు
- కార్యాలయాలకు అద్దెను బూచిగా చూపిస్తున్న వైనం
- వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా
- నివేదికల రూపకల్పన!
జూన్ నాటికి ఉద్యోగులందరూ హైదరాబాద్ వదిలి అమరావతికి రావలసిందే... ఇది ప్రభుత్వం మాట. అబ్బే అదెక్కడ సాధ్యం... పూర్తి స్థాయిలో తరలింపు జరగాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిందే... ఇది ఉన్నతాధికారుల మాట! ఈ వైరుధ్యం ఎందుకంటారా? విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాలకు వసతులు దొరకాలంటే చదరపు అడుగు రూ.45లకు తక్కువ లేదట! హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారులు ఈ మాట చెప్తున్నారు.
పాలనా వ్యవస్థ ప్రజలకు చేరువగా ఉండడానికి హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులందరూ వచ్చే జూన నెలలోగా తరలిరావలసిందేనని ప్రభుత్వం డెడ్‌లైన విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... విజయవాడలో నివాస గృహాల అద్దెలు భారీగా పెరిగిపోయాయని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతూ వచ్చారు. రెండు బెడ్‌రూముల ఫ్లాట్ 25 వేలు ఉందని తప్పుదారి పట్టించారు. ‘ఆంధ్రజ్యోతి’ దీనిపై విజయవాడ, గుంటూరు, మంగళగిరి పట్టణాల్లో సర్వే జరిపి అద్దెలు ఎలా ఉన్నాయో సవివరంగా వెల్లడించింది. అప్పటి నుంచి నివాస గృహాల అద్దెల గురించి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడటం తగ్గించారు. ప్రభుత్వ స్వర తీవ్రత గుర్తించిన ఉద్యోగులు ఇక హైదరాబాద్ వీడక తప్పదనే భావనకు వచ్చి మానసికంగా సిద్ధమవుతున్నారు.
ఉద్యోగులు మెత్తబడినా... ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారి, ఫైనాన్స విభాగంలో ఉన్న మరో ఉన్నతాధికారి అమరావతికి తరలింపు పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజులలో వారు సీఎంను కలిసి తరలింపులో ఎదురయ్యే సాధకబాధకాలపై ఒక నివేదికను సమర్పించనున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలు అందుబాటులో లేవని, ఉన్న భవనాలకు అడుగుకు రూ.45 అద్దె చెబుతున్నారని నివేదికలో పొందుపరిచినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నట్లు ప్రభుత్వానికి నివేదించనున్నారని తెలిసింది. వాస్తవానికి విజయవాడ బీసెంట్ రోడ్డు, బందరు రోడ్డు వంటి కమర్షియల్ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చదరపు అడుగుకు ఈ రేటు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో చదరపు అడుగు రూ.10 నుంచి రూ.20 మధ్య ఉంది. మంగళగిరి, గుంటూరులో కూడా అనేక భవనాలు తక్కువ అద్దెలకే అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి నుంచి వెళుతున్న నివేదికలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి
No comments:
Post a Comment