- రెవెన్యూ రికార్డులను సెట్‌రైట్ చేస్తా
- పోలీసు, ఆరోగ్య శాఖలనూ సంస్కరిస్తా
- సీమను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు
- అనంతపురాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతా
- ఏ పని చేసినా తొలి ప్రాధాన్యం జిల్లాకే: బాబుపాలనలో టెక్నాలజీ వినియోగానికి, సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి ఆన్‌లైన్ బాట పట్టించనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆత్మకూరు మండలం తలుపూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండో విడత ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతోందన్నారు. రెవెన్యూ సేవలను మీ-సేవకు అనుసంధానించడం వల్ల త్వరితగతిన సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు ఉంటుందన్నారు.‘‘నిత్య జీవితంలో టెక్నాలజీ ఓ భాగమైంది. ఎన్డీయే ప్రభుత్వంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు టెక్నాలజీ అభివృద్ధి కోసం నేను ప్రయత్నించాను. ఫలితంగానే నేడు టెక్నాలజీ వినియోగం విస్తరిస్తోంది. టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం’’ అని సీఎం చెప్పారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, ఏఎన్‌ఎంలకు కూడా ట్యాబ్, కంప్యూటర్లు అందజేసి గ్రామస్థాయిలోనూ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామన్నారు. అనంతపురం జిల్లా యంత్రాంగం అందులో తొలిస్థానంలో ఉందని సీఎం అభినందించారు. ఏపీలో ఎక్కడున్నా పింఛన్ తీసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. రెవెన్యూలో చేపట్టిన సంస్కరణలు ఆశించిన ఫలితాలిస్తున్నాయని, అదే స్ఫూర్తితో వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. పేదలకు యంత్రాంగం అందుబాటులో ఉండేలా చేయడమే లక్ష్యమని ప్రకటించారు.అనంతపురానికి అగ్ర తాంబూలంరాయలసీమకు సాగునీటిని తేవాలన్న ఉద్దేశంతోనే గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చిందని చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారుతోందనే భయం ఇక్కడి ప్రజల్లో ఉందన్నారు. వారి భయాలను పోగొట్టడానికి అప్పట్లో ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రతిపాదించారన్నారు. టీడీపీని ఎన్టీఆర్ హయాం నుంచి అనంతపురం జిల్లా ఆదరిస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 12 సీట్లిచ్చి కంచుకోటగా నిలిచిందన్నారు. ఏ పని చేసినా మొదటి ప్రాధాన్యం అనంతపురం జిల్లాకు ఇవ్వాలనే లక్ష్యంతోనే తాను పనిచేస్తున్నట్లు వివరించారు. కరువు రహిత జిల్లాగా అనంతను తీర్చిదిద్దడం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చెరువులు, రిజర్వాయర్లకు, హంద్రీనీవా, తుంగభద్ర నీటిని అందించడం ద్వారా 20 మీటర్ల లోతులో ఉన్న భూగర్బ జలాలను 8 మీటర్లకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమిలో ఇంకించడానికి లక్ష ఫారంపాండ్లు తవ్వడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఉపాధి అవకాలు మెరుగుపరచడంలో భాగంగానే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కంకణబద్ధులమయ్యామన్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉన్నందున రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, దీనివల్ల ఎక్కువ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందన్నారు. తాను సీమలోనే పుట్టానని, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తనకు తెలుసన్నారు.విభజన కష్టాల నుంచి అభివృద్ధి బాటలోకి..రాష్ట్ర విభజన నష్టాన్ని అధిగమించి ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. డ్వాక్రా సంఘాలకు త్వరలో రూ. 7 వేల రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్‌ప్లాన్ కింద నిధులు, సాగునీటికి రూ.9వేల కోట్లు కేటాయించడం, పేద ప్రజలకు రూ.3 లక్షలతో ఇళ్ల నిర్మాణం, పేదల కోసం జనరిక్ మెడిసిన్స్ తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు సీఎం వివరించారు. పిల్లల భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దడం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కాగా, రాష్ర్టాభివృద్ధి కోసం సీఎం అహరహం శ్రమిస్తున్నారని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ‘మీ ఇంటికి- మీ భూమి’ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్న ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.అనంతపురం జిల్లాలో 8 లక్షల హెక్టార్లున్న భూమిని 12 లక్షలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించి రైతాంగానికి కష్టాలు తెచ్చిపెట్టిందని హిందూపురం ఎంపీ కిష్టప్ప విమర్శించారు. ఆ పాలకుల తప్పిదాలు చక్కదిద్దడానికి మరో ఐదేళ్లు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమా, ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు
Wednesday, 11 November 2015
3 నెలల్లో ప్రక్షాళన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment