ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఇటీవల వచ్చిన ఎన్నో ప్రమాదకరమైన భూకంపాల్లో వేలాది మంది మరణించగా... రాష్ట్రంలోని అన్ని కాంక్రీటు నిర్మాణాలు శిథిలమై ఎంతో ఆస్తికి నష్టం వాటిల్లింది. అయితే ఆ సందర్భాల్లోనూ అక్కడి వందల ఏళ్ళనాటి చారిత్రక భవనాలు మాత్రం తట్టుకొని నిలబడగలిగాయి. వాటిలో ఏమాత్రంచెక్కు చెదరకుండా నిలబడిన 728 ఏళ్ళనాటి ఓ పొడవాటి భవనం అందరినీ ఆకట్టుకుంటోంది.
కోటి బనాల్ శైలి... సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చినట్లు ఆధారాలు చెప్తున్నాయి. అత్యుత్తమ నమూనాలతో, భూకంప నిరోధక డిజైన్లతో ఈ నిర్మాణాలు ఎంతో కీర్తి గడించాయి. అయితే వీటి నిర్మాణంలో స్థానికంగా దొరికే రాళ్ళతోపాటు...చెక్క, భూ కంపాల సమయంలో ఇతర ప్రయోజనాలు అందించే పలు పదార్థాలను వినియోగించారు. ఇటువంటి భూకంప నిరోధక భవనాల నిర్మాణం సాధారణంగా బేస్ పైన 7 నుంచి12 మీటర్లు ఉంటుంది. వీటిలో సంప్రదాయ ఇళ్ళు ఐదు అంతస్తులు కలిగి ఉంటాయి. ఇటువంటి ఇళ్ళ నిర్మాణంలో అన్నింటికీ సుమారుగా ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. సాధారణ లే అవుట్ తోపాటు... ఇవి ఎత్తైన, రాతిలాంటి ప్రాంతాల్లో నిర్మించి ఉంటాయి.
చెక్క స్తంభాలతో క్రమ పద్ధతిలో ఉండే నిర్మాణాల్లో ఒక్కో అంతస్తులోనూ వెలుగు ప్రసరించే విధంగా చిన్న చిన్న కటికీలమాదిరిగా వెంటిలేషన్ ఏర్పాటు చేసి ఉంటాయి. భూకంప తీవ్రతను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఓ ఎలస్టో ప్లాస్టిక్ పదార్థంతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండే చెక్కను ఈ గృహాల్లో విస్తృతంగా వాడారు. ఈ నిర్మాణాల వెనుక ఏకైక లక్ష్యం నిర్వాసితుల సౌకర్యాలకన్నా భద్రతకే ప్రాముఖ్యతను ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక సౌకర్యాలకోసం ప్రజలు ఆసక్తి చూపడంతో ఇటువంటి భద్రతాపరమైన విషయాలను, ప్రాచీన పద్ధతులను వదిలిపెట్టడంతో ఆ భవనాల నాశనమూ ప్రారంభమైంది. ఇప్పటి ప్రజలకు ఆ నిర్మాణాలపై ఓ అవగాహన కలిగించకపోతే ఆ సంప్రదాయ భవనాలు మరింత నాశనమయ్యే అవకాశం ఉంది.
No comments:
Post a Comment