- వేల కోట్ల అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది.. నెల రోజుల్లో రోడ్లు అద్దంలా మెరుస్తాయి
- నగర తాగునీటి అవసరాల కోసం శామీర్‌పేట, రామోజీ ఫిలింసిటీ సమీపంలో రిజర్వాయర్లు
- సంగారెడ్డి, వికారాబాద్, షాద్‌నగర్, చౌటుప్పల్, భువనగిరిలను టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేస్తాం
- చెత్త సేకరణకు ఆటో ట్రాలీలు, రెండు రంగుల డబ్బాల పంపిణీకి శ్రీకారం
భాగ్యనగరం ప్రపంచంలోనే మేటి నగరం అయి తీరుతుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా సోమవారమిక్కడ పీపుల్స్‌ప్లాజా మైదానంలో చెత్త తరలించే ఆటో ట్రాలీలకు సీఎం జెండా ఊపారు. రెండు రంగుల చెత్త డబ్బాల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... పారిశుధ్య నిర్వహణకు తొలి అడుగు పడటం ఆనందంగా ఉందని, చెత్త తరలింపు ఆటో ట్రాలీలు తీసుకుంటున్నవారు స్వచ్ఛ సారథులుగా బయల్దేరుతున్నారని పేర్కొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సమైక్య రాష్ట్రంలో నష్టపోయిందన్నారు. కోటి మంది జనాభా కలిగిన మిగతా నగరంలో ప్రజలకు కనీసం తాగునీరు అందించేందుకు ఒక జలాశయం లేదని, వర్షం కురిస్తే నీరు వెళ్లే మార్గం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నిజమైన స్మార్ట్‌సిటీగా, గ్లోబల్ నగరంగా అభివృద్ధి చెందాలంటే వేల కోట్ల అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు.
అద్దంలా రోడ్లు.. రూ.337 కోట్లతో పనులు
అడ్డదిడ్డంగా ఉన్న నగర రహదారులను మెరుగుపరిచేందుకు రూ.337 కోట్లతో 912 పనులకు టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, ఇవి పూర్తికాగానే నెల రోజుల్లో నగర రోడ్లు అద్దంలా మెరుస్తాయని సీఎం చెప్పారు. ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రజల సహకారంతో రాబోయే మూడు నాలుగేళ్లలో హైదరాబాద్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తంచేశారు. అనేక చోట్ల మంచినీరు, డ్రైనేజీ నీరు కలుస్తున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి జలమండలి, జీహెచ్‌ఎంసీ తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని వివరించారు. నగరం శాస్త్రీయంగా అభివృద్ధి చెందలేదని, అడ్డదిడ్డంగా కుళ్లబొడిచారని వ్యాఖ్యానించారు. వర్షం కురిస్తే కార్లు పడవలుగా మారుతున్నాయన్నారు.
నగరం కోసం రెండు రిజర్వాయర్లు
నిజాం కాలం నాటి గండిపేట, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ తప్పిస్తే నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రత్యేక జలాశయం లేకపోవడం దారుణమని సీఎం అన్నారు. అటు నాగార్జునసాగర్, ఇటు ఎల్లంపల్లి నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 15 టీఎంసీల చొప్పున రెండుచోట్ల రెండు జలాశయాలకు శ్రీకారం చుట్టామన్నారు. శామీర్‌పేట, రామోజీ ఫిలింసిటీ సమీపంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.
శాటిలైట్ టౌన్‌షిప్పులు రావాలి
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్‌లో సరిపడా ఫ్లై ఓవర్లు రావాలని సీఎం చెప్పారు. ‘‘ఎలుక తోకల్లాంటి ఫ్లై ఓవర్లతో అంతర్జాతీయ స్థాయి రాదు. ఇటీవల చైనా వెళ్లినప్పుడు అక్కడి ఫ్లై ఓవర్లు చూశా. ఇక్కడ కూడా అలాంటివి నిర్మించేందుకు అక్కడి కన్సల్టెన్సీల సేవలు పొందాలని అధికారులకు సూచించా. ఫ్లై ఓవర్ల నిర్మాణంతోపాటు తెలంగాణలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు ప్రపంచబ్యాంకు తరహాలో ఏర్పాటైన బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్‌ను రూ.25 వేల కోట్ల రుణం కోరాం. అలాగే హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందాలి. సంగారెడ్డి, వికారాబాద్, షాద్‌నగర్, చౌటుప్పల్, భువనగిరి, ఘట్‌కేసర్, గజ్వేల్, తూఫ్రాన్ శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చెందాలి. ఓఆర్‌ఆర్ చుట్టూ కూడా మెట్రోరైలు విస్తరించాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని కేసీఆర్ వివరించారు.
అన్ని ఇళ్లకు ట్రాలీలు చేరే ఏర్పాట్లు
ప్రస్తుతం చెత్తను తరలించేందుకు 1,005 ట్రాలీలు అందుబాటులో ఉన్నాయని, నెలాఖరులోగా అన్ని ఇళ్లకు చేరే ఏర్పాట్లు చేస్తామని సీఎం తెలిపారు. అలాగే దాదాపు చెత్త డబ్బాలు 42 లక్షలు అవసరం ఉండగా.. 23 లక్షలు ఉన్నాయన్నారు. తడి చెత్తను గ్రీన్ డబ్బాలో, పొడిచెత్తను బ్లూ డబ్బాలో వేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఇళ్ల కూల్చివేతల వ్యర్థాలు (డెబ్రిస్) తరలించే ప్రక్రియ కూడా టెండర్ల దశలో ఉందని చెప్పారు. పేదలకు ఈ వ్యర్థాలను ఉచితంగా తరలిస్తామన్నారు.
అమ్మలు, అక్కలూ తెలుసుకోండి..
చెత్త డబ్బాల వినియోగం గురించి సీఎం కేసీఆర్ ఓపిగ్గా వివరించారు. ‘‘అమ్మలు.. అక్కలూ.. తెలుసుకోండి. ఆకుపచ్చ డబ్బాలో తడి చెత్త, నీలిరంగు డబ్బాలో పొడి చెత్త వేయండి. ఇంటికొచ్చే ఆటో ట్రాలీల్లోనూ రెండు భాగాలుంటాయి..’’అని వివరించారు. ప్రపంచవ్యాప్తంగానూ తడి, పొడి చెత్తకు ఈ రెండు రంగులనే వాడుతున్నందున వీటినే ఎంపిక చేశామన్నారు. పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి వాటి గురించి మహిళలకు వివరించాలన్నారు.
ఖైరతాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు
అక్రమ నిర్మాణాలు, లేఔట్ల క్రమబద్ధీకరణకు కల్పించిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఐడీహెచ్ కాలనీ తరహాలో నగరంలో డబుల్‌బెడ్రూం ఇళ్లకు శ్రీకారం చుట్టామని, త్వరలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడతామని సీఎం వివరించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ వీటిని నిర్మిస్తామన్నారు. శివారుల్లోని 12 మున్సిపాలిటీల ప్రజలకు త్వరలోనే ఇంటింటికీ నల్లా నీరు అందుబాటులోకి రానుందన్నారు. ఇందుకు హడ్కో రూ.1,900 కోట్ల రుణం మంజూరు చేసిందని, త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. 15 రోజుల తర్వాత మరో నాలుగైదు రోజులపాటు మలి దఫా స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
తొలగించిన కార్మికులు మళ్లీ విధుల్లోకి..
- తిరిగి తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశం
- 1,600కు పైగా కార్మికులకు ఊరట
జీహెచ్‌ఎంసీలో ఇటీవల తొలగించిన పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి కానుక ప్రకటించారు. సమ్మెలో పాల్గొన్న కారణంగా కొద్దినెలల క్రితం తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి సూచించారు. తొలగించిన కార్మికుల నుంచి అండర్‌టేకింగ్ తీసుకొని అందరినీ విధుల్లో నియమించాలన్నారు. ‘సపాయన్నా.. నీకు సలామన్నా ’ అంటూ తానే పారిశుధ్య కార్మికుల పనిని గుర్తించి జీతభత్యాలు పెంచాలని నిర్ణయించాక... కొందరు యూనియన్ల నేతలు రెచ్చగొట్టి వారితో సమ్మె చేయించారన్నారు. రంజాన్, బోనాల పండుగల వంటి సమయంలో సమ్మె ద్వారా సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నించినందునే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు.
జంటనగరాలకు చెడ్డపేరు రావద్దనే ఉద్దేశంతోనే వారిపై చర్యలు తీసుకున్నాం తప్ప వారిపై ఎలాంటి కోపం లేదన్నారు. ‘స్వచ్ఛ హైదరాబాద్ కోసం పని చేయండి. హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుదాం’ అని కార్మికులను ఉద్దేశించి అన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 1,600కి పైగా కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు అమరేశ్వర్, మున్సిపల్ జేఏసీ నాయకుడు పాలడుగు భాస్కర్ తదితరులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు
No comments:
Post a Comment